కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కు: కేటీఆర్
ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేటీకరణ చేయనివ్వమని
దిశ, మంచిర్యాల : ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేటీకరణ చేయనివ్వమని, ఆ సంస్థను కాపాడుకుంటామని బీఆర్ఎస్ చీఫ్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన సింగరేణి పరిధి లోని మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులతో తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందన్నారు. కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కు అయి వాళ్లకు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ లు కుమ్మక్కై సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికుని అర్థమవుతోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలతో ఉద్యమ కాలం నాటి నుంచే పని చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం అనేది మన పార్టీ విధానమని నేతలకు స్పష్టం చేశారు. అందుకే ప్రైవేటు కంపెనీలు ఎంత ఒత్తిడి తెచ్చినా పక్కకు పెట్టి.. రైతు బీమాను ఎల్ఐసీకి ఇచ్చామని గుర్తు చేశారు. విద్యుత్ ప్రాజెక్టులను కట్టే బాధ్యతలను బీహెచ్ఈఎల్ కి అప్పగించామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర యేళ్ల పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం పని చేశామో ప్రతి సింగరేణి కార్మికునికి అవగాహన ఉందని తెలిపారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు తొమ్మిది సంవత్సరాలకు పైగా తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయకుండా ఆపగలిగారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రెండు బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు కేటాయించినా, తట్టెడు తెలంగాణ బొగ్గును ఎత్తకుండా విజయవంతంగా అడ్డుకున్నామ కేటీఆర్ నేతలతో వివరించారు. కానీ, ప్రభుత్వం లోకి వచ్చి ఆరు నెలలు కాక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం.. గెలిచి రెండు వారాలు కాక ముందే బీజేపీ ఎంపీలు ఆ పార్టీ నాయకత్వం కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలానికి పెట్టాయని స్పష్టం చేశారు. కానీ, సింగరేణి కోసం ఆది నుంచి పోరాటం చేసి.. సింగరేణిని బలోపేతం చేసిందే బీఆర్ఎస్ అన్నారు. సింగరేణి కష్టాల్లో ఉంటే కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న విషయం మర్చిపోతున్నారని, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటామని మరోమారు గుర్తు చేశారు.