విధుల్లో ఉన్న పోలీసులపై దాడి..ఆ పార్టీకి చెందిన 20 మంది పై కేసు నమోదు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం తమ పార్టీ కౌన్సిలర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాడాన్ని నిరసిస్తూ జరిగిన ఆందోళనలో అరెస్టు చేసిన 20 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ పోలీసులు పేర్కొన్నారు.
దిశ, ఆదిలాబాద్:ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం తమ పార్టీ కౌన్సిలర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాడాన్ని నిరసిస్తూ జరిగిన ఆందోళనలో అరెస్టు చేసిన 20 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆందోళనలో భాగంగా బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య సుమారు గంటపాటు తోపులాట జరిగింది. ఈ తోపులాటతో విసుగు చెందిన ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళన కారులపై లాఠీ జులిపించారు. అనంతరం వారిని అరెస్టు చేసి ఇతర పోలీస్ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే.
అయితే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని భావించిన పోలీసులు నూతన చట్టం ప్రకారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందంతో పాటు 20 మందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ ఆందోళనలో ప్రభుత్వ వాహనం ధ్వంసం, డ్రైవర్‌ను కొట్టడం, విధుల్లో ఉన్న పోలీసులకు రక్తపు గాయాలకు సంబందించిన కేసులో 20 మంది బీజేపీ నేతలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వారు తెలిపారు. రిమాండ్ కు తరలించిన వారిలో స్థానిక ఎమ్మెల్యే తనయుడు పాయల్ శరత్, ఇతర నేతలు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్నారు.