సింగరేణి ఆధ్వర్యంలో 1900 ఉద్యోగాల భర్తీ
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఏడాదిలో సింగరేణి ఆధ్వర్యంలో దాదాపు 1900 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
దిశ, ఆదిలాబాద్ బ్యూరో: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఏడాదిలో సింగరేణి ఆధ్వర్యంలో దాదాపు 1900 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఇందులో భాగంగా వారంలో 489 ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ అయ్యాయని.. మరో 1352 ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు ఆయన ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ బంజారా హిల్స్‌లో నిర్మించనున్న సింగరేణి అతిథి గృహ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 134 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణికి హైదరాబాద్‌లో గెస్ట్ హౌస్ లేకపోవడం బాధాకరమని.. కార్మికులు, అధికారుల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. సింగరేణి ప్రాంతానికి చెందిన తనకు ఈ అతిథి గృహాన్ని ప్రారంభించే అవకాశం లభించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సింగరేణి విస్తరణ చర్యల్లో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జైపూర్ లో నిర్వహిస్తున్న ప్రస్తుత 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో త్వరలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
రామగుండంలో ఉన్న జెన్ కో ఆధ్వర్యంలో దశాబ్దాల కిందట నిర్మించిన ప్లాంట్ ఆవరణలో 800 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో సింగరేణి థర్మల్ సామర్థ్యం 2800 మెగావాట్లకు చేరుతుందన్నారు. సింగరేణి సుస్థిర భవిష్యత్ కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం కొత్త గనులను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కలిసి తాడిచర్ల -2 గనిని సింగరేణికి కేటాయించేందుకు విజ్ఞప్తి చేయగా.. సానుకూల స్పందన లభించిందన్నారు.
అలాగే నైనీ గని ప్రారంభానికి ఉన్న అవాంతరాలను తొలగించేందుకు ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడించినట్లు తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలోని రాష్ట్రంలోని భారీ జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు, ఓపెన్ కాస్ట్ లపై పవన విద్యుత్ వంటివి ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. సింగరేణి సమస్యలపై మానవీయ కోణంలో ముందుకు వెళ్తున్నామని... తాము తీసుకునే నిర్ణయాలన్నీ సింగరేణి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసేవిగానే ఉంటాయన్నారు. సింగరేణి సంపదను పెంచడమే తమ లక్ష్యమని.. అలా పెంచిన సంపదను కార్మికులకు పంచడమే ధ్యేయమని ప్రకటించారు. సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ లైజన్ ఆఫీసర్లు ఉన్న మాదిరిగానే బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకాన్ని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
సంస్థ సీఅండ్‌ఎండీ బలరామ్ మాట్లాడుతూ… 134 సంవత్సరాల చరిత్ర గల సింగరేణి సంస్థకు హైదరాబాద్‌లో సొంత గెస్ట్ హౌస్ లేదని, రాష్ట్ర ప్రభుత్వం వారు సొంత గెస్ట్ హౌస్ కోసం వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించడమే కాక శంకుస్థాపనకు విచ్చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సంస్థను దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలబెడతామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేం సాగర్ రావు, మాజీ ఎంపీ, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్, ప్రాతినిథ్య సంఘ నాయకులు జనక్ ప్రసాద్ పాల్గొన్నారు.