సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. రూ. కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభం
తెలంగాణలో సింగరేణి కార్మికులకు ప్రమాద బీమా పథకం ప్రారంభమైంది. ...
దిశ, వెబ్ డెస్క్: సింగరేణి కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కార్మికుల ప్రమాద బీమా రూ. కోటి ప్రకటించారు. ఈ మేరకు బ్యాంకర్లతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. హైదరాబాద్ సచివాలయంతో బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సింగరేణి కార్మికులను నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. సింగరేణి కార్మిక లోకానికి ఇది చారిత్రాత్మక రోజు అని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర క్రియాశీలకమన్నారు. గత పాలకులు సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామని రేవంత్ తెలిపారు.
గత సీఎం కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు ఏడాదికి రూ.70 వేల కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు ఆపేస్తే 15 రోజుల్లో రైతు బంధు చెల్లించామని గుర్తు చేశారు. 2014లో మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని పదేళ్లలో సీఎం కేసీఆర్ దివాళా తీయించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్ రూ. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాళా తీయించిన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడాలేరని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.