యూనివర్సిటీల వీసీల నియామకానికి ముందడుగు!

రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు వీసీలను నియమిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు ప్రక్రియ వేగవంతమైనట్లు తెలుస్తున్నది.

Update: 2024-09-01 03:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు వీసీలను నియమిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు ప్రక్రియ వేగవంతమైనట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో బీఆర్‌ అంబేడ్కర్, ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, పొట్టి శ్రీరాములు తెలుగు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ, జేఎన్‌ఎఫ్‌ఏయూ యూనివర్శిటీలు ఉన్నాయి. ఈ వర్సిటీల్లోని వీసీల పదవి కాలం ఈ ఏడాది మే 21న ముగిసింది. అప్పటి నుంచి ఇన్‌చార్జీ వీసీలతోనే నెట్టుకొస్తున్నారు. అయితే సీఎం ప్రకటన తర్వాత మూడు నెలల అనంతరం వీసీల నియామక ఫైల్ లో కదలిక వచ్చింది. విద్యాశాఖ నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి ఈ ఫైల్ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఒకటీ, రెండు రోజుల్లో సెర్చ్ కమిటీలు భేటీ అయ్యే అవకాశం ఉంది. కమిటీ సభ్యులు వీసీల పేర్లను ప్రతిపాదించనున్నారు. కాగా అందులో ఎవరో ఒకరిని గవర్నర్ ఫైనల్ చేయనున్నారు. ఇదిలా ఉండగా అటవీ విశ్వవిద్యాలయం, మహిళా వర్సిటీలు ఇటీవలే ఏర్పడటంతో వీటికి కొత్తగా వీసీలను నియమించాల్సి ఉండగా, ఈ రెండింటికీ సెర్చ్‌ కమిటీతో నిమిత్తం లేకుండానే వీసీలను నియమించే వెసులుబాటు ఉంది.

త్వరలో సెర్చ్ కమిటీల భేటీ..

వీసీల నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలు వేసి నెలలు గడుస్తున్నది. అయితే ప్రస్తుతం సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో రెండు, మూడ్రోజుల్లోనే ఈ కమిటీలు భేటీ అయ్యే అవకాశముంది. వీసీల ఎంపిక ప్రక్రియను సెర్చ్‌ కమిటీలు చేపడుతాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ఒక్కో వర్సిటీకి ముగ్గురితో సెర్చ్‌ కమిటీ ఏర్పడుతుంది. ఇందులో ప్రభుత్వ నామిని, యూజీసీ చైర్మన్‌ నామిని, యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(ఈసీ) నామిని ఉంటారు. రాష్ట్ర సర్కార్ తరపున చీఫ్ సెక్రటరీ నామినీగా ఉన్నారు. ఈ కమిటీ వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ముగ్గురు పేర్లను సూచిస్తుంది. కాగా, ఆయా వర్సిటీల్లో వీసీ పోస్టు కోసం 312 మంది నుంచి 1382 దరఖాస్తులు అందాయి. మార్చిలోనే వాటి స్క్రూట్నీ ప్రక్రియ పూర్తయింది. అయితే, అప్పటికే ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియామకం పెండింగ్ పడింది. ఎన్నికల అనంతరం సర్కార్ కూర్పు, ఇతర కారణాల నేపథ్యంలో ఆలస్యమైంది. కాగా, ప్రస్తుతం ఎలాంటి హడావుడి లేకపోవడంతో ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి నూతన వీసీలను నియమించాలని భావిస్తున్నారు.


Similar News