తెలంగాణలో సంచలన ఘటన.. ఓటుకు డబ్బు ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
తెలంగాణలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓటుకు డబ్బులు తక్కువ ఇచ్చారని మనస్థాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సీఎం
దిశ, కామారెడ్డి: తెలంగాణలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓటుకు డబ్బులు తక్కువ ఇచ్చారని మనస్థాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలోకి దిగిన కామారెడ్డి నియోజకవర్గంలో చోటు చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరు గ్రామానికి చెందిన తోకల నారాయణ అనే వ్యక్తి ఇంట్లో నాలుగు ఓట్లు ఉండగా.. ఓటుకు రూ.1000 చొప్పున ఇవ్వాలని కోరాడు. కానీ ఓ పార్టీకి చెందినవారు రూ. 2 వేలు ఇచ్చారు. ఓటుకు రూ.1000 చొప్పున తనకు రూ.4 వేలు ఇవ్వాలని అడిగినప్పటికీ.. రూ. 2 వేలు మాత్రమే ఇవ్వడంతో సాయంత్రం వరకు వేచి చూశాడు.
పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ఓటు వేయకపోగా.. తన భార్యను కూడా ఓటు వేయనివ్వలేదు. గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత గ్రామస్తులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే నారాయణ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. చేతులకు స్వల్ప గాయాలతో అతడు బయటపడ్డాడు. ఓటుకు నోటు ఇవ్వకుంటే ఆత్మహత్యకు పాల్పడతారా అంటూ పలువురు నారాయణను మందలించారు.