బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన 25 మంది ఎమ్మెల్సీలు!

ఓ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కాంగ్రెస్‌లో చేరుతుండగా, మరోవైపు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు సైతం పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది.

Update: 2024-04-02 02:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఓ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కాంగ్రెస్‌లో చేరుతుండగా, మరోవైపు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు సైతం పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది. ఎప్పుడంటే అప్పుడు పార్టీ కండువా కప్పుకుంటామని సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తున్నది. ఆలస్యం చేయకుండా, పార్లమెంట్ ఎన్నికల లోపు చేరికల ప్రక్రియను పూర్తి చేయాలని రిక్వెస్టులు పెడుతున్నట్టు సమాచారం. పెద్దల సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కేవలం ముగ్గురు మాత్రమే ఉండగా, బీఆర్ఎస్ పార్టీకి సుమారు 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో మెజారిటీ సభ్యులు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది.

చేర్చుకోవాలని ఒత్తిళ్లు

తమ పార్టీలోకి రావాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై రూలింగ్ పార్టీ ఒత్తిడి పెట్టడం సహజం. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వెంటనే చేర్చుకోవాలని గులాబీ ఎమ్మెల్సీలు ఒత్తిడి పెడుతున్నట్టు సమాచారం. తమకు సన్నిహితంగా ఉండే మంత్రులు,ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి చేరికల ప్రతిపాదనలను పదే పదే ప్రస్తావిస్తున్నట్టు తెలిసింది. అయితే ఎమ్మెల్సీల చేరికల విషయంలో ఓ ప్లాన్‌తో ఉన్నామని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. “ముందు అసెంబ్లీలో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తమ టార్గెట్. ఆ తర్వాత ఎమ్మెల్సీలపై ఫోకస్ పెడుతాం.’’ అని వివరించారు.

ఎక్కువ మంది మూలలు కాంగ్రెస్‌వే

పెద్దల సభలో కాంగ్రెస్ పార్టీకి 28 మంది ఎమ్మెల్సీలు ఉండగా, అందులో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు‌గా పనిచేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత అప్పటి రాజకీయ కారణాల వల్ల గులాబీ పార్టీలోకి వెళ్లారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మండలి సమావేశంలో చాలా మంది ఎమ్మెల్సీలు జోష్‌గా కనిపించారు. అప్పటి నుంచే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నట్టు తెలిసింది.

విలీనానికి 20 మంది ఎమ్మెల్సీలు

20 మంది ఎమ్మెల్సీల మద్దతు ఉంటే, శాసన మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కావొచ్చు. అప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. ప్రస్తుతం పార్టీ మారేందుకు 20 నుంచి 25 మంది ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇంత మందిని పోగు చేయడంలో కీలక పదవుల్లో ఉన్న ఒకరిద్దరు ఎమ్మెల్సీల కృషి ఉన్నట్టు టాక్ ఉంది. ఘర్ వాపస్ కోసం కొన్ని రోజులుగా ఇతర ఎమ్మెల్సీలను ఒప్పించి, సక్సెస్ అయినట్టు తెలుస్తున్నది.

Tags:    

Similar News