కొడంగల్ కు ఇచ్చిన నిధులలో 10 శాతం మాకు ఇచ్చినా చాలు: బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ లకు నిధులు లేవని, దీంతో అభివృద్ధి నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ లకు నిధులు లేవని, దీంతో అభివృద్ధి నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్సిపాలిటీలకు నెలనెలా నిధులు ఇవ్వడం లేదని విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికుల కొరత వల్ల.. పారిశుద్ధ్య నిర్వహణ సమస్యలు నెలకొన్నాయని సూర్యనారాయణ గుప్తా తెలిపారు. కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అనేక మున్సిపాలిటీల్లో సరిపడా సీసీ టీవీలు కూడా లేవన్నారు. వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉందని, పసిపిల్లలు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కుక్కలతో పాటు కోతుల బెడద కూడా తీవ్రంగా ఉందని శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. చిన్న మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ కోసం రూ.26 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరతగతిన ట్రిపుల్ ఆర్ ను పూర్తి చేయాలన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక నిజామాబాద్ అర్బన్ లో 100 మీటర్ల రోడ్డు కూడా వేయలేదని సూర్యనారాయణ గుప్త విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కొడంగల్ కి ఇచ్చిన నిధుల్లో 10 శాతం నిజామాబాద్ కు ఇస్తే అద్భుతంగా అభివృద్ధి చెందేదని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటుపై మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిత్యం సమస్యలే ఎదురవుతున్నాయని, విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్న దుస్థితిలో ఉన్నామని సూర్యనారాయణ గుప్త ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితి మారాలని, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.