సెక్యూరిటీ లేని ‘గార్డులు’

– లాక్‌డౌన్‌ రోజుల్లో అందని జీతాలు – పదిశాతం లోపు మందికి డ్యూటీలు దిశ, న్యూస్‌బ్యూరో: పలు ప్రముఖ సంస్థలు, వ్యక్తులతో పాటు ధనవంతుల ఇండ్లకు కాపలాగా రాత్రి, పగలు డ్యూటీలు చేసే సెక్యూరిటీ గార్డుల జీవితాలకు రక్షణ లేకుండా పోయింది. లాక్‌డౌన్ విధింపుతో డ్యూటీలు పోగొట్టుకుని ఇండ్లకే పరిమితమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 15 లక్షల మందికి పైగా సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారని సెక్యూరిటీ ఏజెన్సీల అసోసియేషన్ గణంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏజెన్సీ సంస్థలు […]

Update: 2020-05-10 09:10 GMT

– లాక్‌డౌన్‌ రోజుల్లో అందని జీతాలు
– పదిశాతం లోపు మందికి డ్యూటీలు

దిశ, న్యూస్‌బ్యూరో: పలు ప్రముఖ సంస్థలు, వ్యక్తులతో పాటు ధనవంతుల ఇండ్లకు కాపలాగా రాత్రి, పగలు డ్యూటీలు చేసే సెక్యూరిటీ గార్డుల జీవితాలకు రక్షణ లేకుండా పోయింది. లాక్‌డౌన్ విధింపుతో డ్యూటీలు పోగొట్టుకుని ఇండ్లకే పరిమితమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 15 లక్షల మందికి పైగా సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారని సెక్యూరిటీ ఏజెన్సీల అసోసియేషన్ గణంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏజెన్సీ సంస్థలు 5-10 శాతం సిబ్బందిని మాత్రమే డ్యూటీలకు తీసుకోగా.. వారు కూడా విధులు నిర్వహించేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్, రీటైల్, ఫార్మా, కెమికల్ సంస్థల్లో సెక్యూరిటీ సిబ్బంది సేవలు అవసరం కాగా.. నగరంలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, మెట్రో వంటి ప్రముఖ కార్యాలయాలు, సంస్థల్లోనూ ప్రైవేటు సెక్యూరిటీ గార్డులే రక్షకులుగా ఉంటున్నారు. రెసిడెన్షియల్, కమర్షియల్, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ వీరిదే కీలక బాధ్యత. సెక్యూరిటీ సిబ్బంది నియామకాన్ని అవుట్ సోర్సింగ్, తాత్కాలిక పద్ధతుల్లోనే చేపడుతూ.. సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా వారి సేవలను ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సెక్యూరిటీ గార్డుల్లో 90 శాతం మందికి డ్యూటీలు, జీతాలు లేకుండా పోగా.. అత్యవసర ప్రభుత్వ విభాగాలు, ఆస్పత్రుల వద్ద మాత్రమే గార్డులను ఉపయోగించుకుంటున్నారు. అందులోనూ పూర్తి స్థాయి సిబ్బందిలో గరిష్టంగా 20 శాతం మందిని మాత్రమే డ్యూటీలకు రప్పించుకుంటున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ మెట్రో స్టేషన్ల వద్ద గతంలో టికెట్ కౌంటర్లు, చెకింగ్, ఫ్లాట్‌‌ఫాం వద్ద డ్యూటీలు చేసే సిబ్బందికి ఇప్పుడు పనిలేకుండా పోయింది. ఇప్పుడు ఇద్దరు లేదా నలుగురు గార్డుల చొప్పున మాత్రమే విధులకు హాజరవుతున్నారు. లాక్‌డౌన్ రోజుల్లో జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పినా ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వ విభాగాలతో పనిచేస్తున్న ఏజెన్సీల్లోనే పరిస్థితి ఇలా ఉందంటే.. ఇక ప్రైవేటు సంస్థల్లో గార్డుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. సెక్యూరిటీ గార్డులకు నెల జీతంగా రూ.7,500 నుంచి గరిష్టంగా రూ.12 వేలు మాత్రమే అందుతున్నాయి. ఏజెన్సీల్లో పీఎఫ్, ఈఎస్ఐ అందించని వాటి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఏజెన్సీలకు ఒక్కో గార్డుపై రూ.15-25 వేల వరకు ముట్టజెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఇదే విధానం పాటిస్తుండటంతో గార్డులకు అడిగేందుకు దిక్కులేకుండా పోయింది.

చేసేవాళ్లను లాక్‌డౌన్ రోజుల్లోనూ కొందరు రాజకీయ నాయకులు, లాయర్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ల వద్ద గార్డులతో డ్యూటీలు చేయిస్తుండటంతో వారు నివాస స్థలాల నుంచి డ్యూటీ ప్రాంతాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేదు. ప్రైవేటు వాహనాలకు కూడా అవకాశం లేకపోవడంతో నడిచేవెళ్తున్నారు. డ్యూటీలు చేస్తే తప్ప ఆదాయం రాకపోవడంతో తప్పని పరిస్థితి. సొంత వాహనాలు లేకపోవడంతో నడిచివెళ్లే డ్యూటీలు చేసుకుంటున్నారు.

డ్యూటీ లేదు.. జీతాలు లేవు

ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల వద్ద డ్యూటీలు చేస్తున్నవారికి వేతనానికి ఎలాగూ గ్యారెంటీ లేకుండా పోయింది. కానీ ప్రభుత్వ విభాగాల్లోనూ, ప్రభుత్వంతో భాగస్వామ్యం కలిగిన మెట్రో వంటి సంస్థల్లోనూ సెక్యూరిటీ గార్డులకు డ్యూటీలు, జీతాలు రావడం లేదు. ప్రభుత్వంతో జాయింట్ వెంచర్లు చేస్తున్న పలు ప్రముఖ ఏజెన్సీల్లో సైతం జీతాలు ఇవ్వకున్నా పట్టించుకునేవారు కనిపించడం లేదు. లాక్‌డౌన్ రోజులకు వేతనం చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయం.. ప్రభుత్వంతో భాగస్వామ్యమైన సెక్యూరిటీ ఏజెన్సీల్లోనే అమలు కావడం లేదు. కొన్ని ప్రైవేటు రంగ సంస్థల్లో జీతంలో కోత విధించినా.. మెయింటెనెన్స్ కోసం కొంత ఇస్తున్నాయి. అయితే సెక్యూరిటీ గార్డులకు ఏ మాత్రం అందడం లేదు. రాష్ట్రంలోని టాప్ లెవల్ ఏజెన్సీలు కూడా డ్యూటీలకు వచ్చిన గార్డులకే జీతాలు ఇస్తున్నాయి తప్ప మిగిలినవారికి ఏమీ ఇవ్వడం లేదు. వచ్చే జీతాల్లో దాచుకునేందుకు కూడా అవకాశం లేకపోవడంతో వారంతా ఇప్పుడు తిండి కోసం అవస్థలు పడుతున్నారు.

Tags:    

Similar News