రాష్ట్రం దిగ్బంధం
కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో ఎక్కడి రైళ్ళు అక్కడే ఆగిపోయాయి. గత 24 గంటల్లో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లకు రావాల్సిన దూర ప్రాంత రైళ్లన్నీ దాదాపుగా చేరుకోవడంతో ఈ స్టేషన్లలో రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. రైలు సర్వీసులన్నీ నిలిచిపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులెవ్వరూ రావడంలేదు. దీంతో ఈ స్టేషన్లు బోసిపోయాయి. కేవలం ఒకటి, రెండు రైళ్ళు మాత్రమే రావాల్సి ఉన్నందున అవి వచ్చిన తర్వాత ఇక రైళ్ళ […]
కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో ఎక్కడి రైళ్ళు అక్కడే ఆగిపోయాయి. గత 24 గంటల్లో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లకు రావాల్సిన దూర ప్రాంత రైళ్లన్నీ దాదాపుగా చేరుకోవడంతో ఈ స్టేషన్లలో రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. రైలు సర్వీసులన్నీ నిలిచిపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులెవ్వరూ రావడంలేదు. దీంతో ఈ స్టేషన్లు బోసిపోయాయి. కేవలం ఒకటి, రెండు రైళ్ళు మాత్రమే రావాల్సి ఉన్నందున అవి వచ్చిన తర్వాత ఇక రైళ్ళ రాకపోకలేవీ ఉండవని సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. శనివారం రాత్రి నుంచే రైలు సర్వీసులన్నీ దేశవ్యాప్తంగా నిలిచిపోవడంతో అప్పటికే మార్గమధ్యంలో ఉన్న రైళ్ళు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోవడంతో ఆదివారం జనతా కర్ఫ్యూ ఉన్నప్పటికీ ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్ళడానికి పోలీసుల అనుమతితో క్యాబ్ సర్వీసులు, ఆటోలకు అనుమతి లభించింది.
దాదాపుగా దూర ప్రాంతం నుంచి అప్పటికే బయలుదేరిన రైళ్ళన్నీ చేరుకోవడంతో సోమవారం ఉదయం నాటికి సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోవాల్సిన రైళ్ళేమీ లేకుండా పోయాయి. దీంతో స్టేషన్‌లో ప్రయాణికులు లేకుండా నిశ్బబ్ద వాతావరణం నెలకొంది. టికెట్ కౌంటర్లన్నీ మూతపడ్డాయి. ఎస్కలేటర్ల అవసరం లేకపోవడంతో వాటిని మూసివేశారు అధికారులు. రైలు సర్వీసులు లేకపోవడంతో ప్లాట్‌ఫారంలపై దుకాణాలన్నీ మూతబడ్డాయి. పోర్టర్లు సైతం స్టేషన్‌కు రాలేదు. ప్రయాణికుల రాకపోకలు తగ్గిపోయాయి. జనతా కర్ఫ్యూ కారణంగా నగరం నుంచి స్వస్థలాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులతో శనివారం తీవ్ర రద్దీ నెలకొన్నప్పటికీ సోమవారం మాత్రం పూర్తిగా నిర్మానుష్య వాతావరణమే కనిపిస్తోంది. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు కూడా నిలిచిపోవడంతో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ కూడా మూతపడింది.
ప్రైవేటు వాహనాల అధిక ఛార్జీల వసూలు
ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘లాక్ డౌన్’ ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించడంతో చాలామంది దూర ప్రాంతాలవారు బస్సులు, రైళ్ళు లేకపోవడంతో ప్రైవేటు కార్లను మాట్లాడుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు కూడా నిలిచిపోవడంతో కార్ల ఆపరేటర్లు ఇష్టారీతిలో ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఇంతకాలం రూ. 150 ఛార్జీ ఉన్న ప్రాంతానికి వెయ్యి నుంచి రూ. 1,500 వరకు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అయినా స్వస్థలాలకు వెళ్ళడానికి ప్రజల అధిక ఛార్జీలను చెల్లించి వెళ్తున్నారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌గేట్లు, చెక్‌పోస్టుల దగ్గర ఏ రాష్ట్రానికి చెందిన వాహనాలు అటువైపే నిలిచిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ఆ వాహనాలను దిగి నడక మార్గం నుంచి చెక్‌పోస్టు అవతలివైపునకు వెళ్ళి ఆ రాష్ట్రానికి చెందిన వాహనాల్లో వెళ్ళిపోతున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు వాహనాలను సరిహద్దు దగ్గరే ఆపేస్తుండడంతో ప్రజలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.