మన ప్రజాప్రతినిధులు ఎక్కడ?.. ఆపదలో పట్టించుకోరా..
దిశ, తెలంగాణ బ్యూరో : నిన్నటి వరకూ ఓట్ల కోసం ఇండ్ల ముందు తిరిగిన నేతలు కష్టకాలంలో మాత్రం కనిపించడం లేదు. అధినేతలకు చీమ కుట్టినా హడావుడి చేసే రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కరోనాతో వందల మంది సచ్చిపోతున్నా పట్టించుకోకుండా ఉంటున్నారు. ఓట్లు అడిగినప్పుడు చూపించిన ప్రేమాభిమానం.. గెలిచిన తర్వాత మాయమైంది. గెలిచినోళ్లే కాదు.. ఓడినోళ్లు, ప్రజల సేవ కోసమే ఉన్నామంటూ కాలరెగరేసే పొలిటికల్లీడర్లు ఇప్పుడు భూతద్ధం పెట్టి చూసినా కానరావడం లేదు. గెలిపిస్తే సేవ చేస్తామన్న […]
దిశ, తెలంగాణ బ్యూరో : నిన్నటి వరకూ ఓట్ల కోసం ఇండ్ల ముందు తిరిగిన నేతలు కష్టకాలంలో మాత్రం కనిపించడం లేదు. అధినేతలకు చీమ కుట్టినా హడావుడి చేసే రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కరోనాతో వందల మంది సచ్చిపోతున్నా పట్టించుకోకుండా ఉంటున్నారు. ఓట్లు అడిగినప్పుడు చూపించిన ప్రేమాభిమానం.. గెలిచిన తర్వాత మాయమైంది.
గెలిచినోళ్లే కాదు.. ఓడినోళ్లు, ప్రజల సేవ కోసమే ఉన్నామంటూ కాలరెగరేసే పొలిటికల్లీడర్లు ఇప్పుడు భూతద్ధం పెట్టి చూసినా కానరావడం లేదు. గెలిపిస్తే సేవ చేస్తామన్న నాయకులు కనీసం సాయం చేయడానికి కూడా ముఖం చాటేస్తున్నారు. కరోనా మహమ్మారితో జనజీవనం అతలాకుతలమైన పరిస్థితుల్లో కూడా ఏ నేత తమ బంగ్లాను విడిచి బయటికి రావడం లేదు. తిన్నారో, తినలేదో కనీసం బతికున్నారో లేక చచ్చారో కూడా పట్టించుకోవడం లేదు. కానీ తమ అధినేతలకు మాత్రం ఏమైనా అయితే పూజలు, దేవుళ్లకు మొక్కడం మాత్రం కచ్చితంగా చేస్తున్నారు. ఇలాగైనా పెద్దసార్ల దృష్టిలో పడుతామని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదేనా సేవా..?
‘ఒక్క అవకాశమివ్వండీ. ఏ ఆపదలోనైనా మీకు అండగా ఉంటాం..’ ఇదీ సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో ప్రతి పార్టీ నేత ప్రజలకు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటే. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆ మాటలు మూగబోయాయి. అండ దేవుడెరుగు. కనీసం ధైర్యం చెప్పే నాథుడే లేడు. ఆపత్కాలంలో ముందుండి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన నాయకులు అడ్రస్ లేకుండా పోయారు. ప్రాణం పోతున్నా పలకరించేవారు కరువయ్యారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులకు కరోనా కాలంలో ఉపాధిలేక, చేతిలో చిల్లిగవ్వ లేక ఒకపూట తినీతినక.. కాలం వెల్లబుచ్చుతున్న తమకు మేమున్నామంటూ భరోసానిచ్చే నేత కానరాలేదని వారు ఆక్రోశిస్తున్నారు.
ఎన్నికలంటే తిరిగారు.. ఇప్పుడేమో భయపడుతున్నారా..?
ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో విస్తృతంగా తిరిగిన నేతలు కష్ట సమయంలో మాత్రం మాయమయ్యారు. రాష్ట్రంలో మండలి ఎన్నికల నుంచి మొదలుకుని నిన్నటి పురపోరులో చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక వరకూ సమావేశాలు, ప్రచారం అంటూ చక్రం తిప్పారు. చైర్మన్ల ఎన్నికకు కూడా కరోనా నిబంధనలన్నీ పక్కనపెట్టి ప్రగతిభవన్పక్కన ఉండే ఓ హోటల్‌లో అందరితోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. సాగర్ఎన్నికల్లో ఓట్లేసిన వారికే కాదు.. విధులు నిర్వర్తించిన వారికి కూడా పాజిటివ్ వచ్చింది. ఏకంగా సీఎం కేసీఆర్‌కు కూడా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఇలా ఓట్ల కోసం తిరిగిన నేతలు ఇప్పుడు ఎక్కడున్నారనేది తెల్వడమే కష్టంగా మారింది. ఒకవేళ ఫోన్ చేసినా కనికరించడం లేదు.
ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకైతే ఓకే..
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాల్లోనే కొంతమంది మినహా మిగిలిన ప్రజాప్రతినిధులు, నేతలందరూ తరిస్తున్నారు. అప్పుడో ఇప్పుడో వచ్చే కళ్యాణలక్ష్మీ చెక్కులు, అత్యవసర సమయంలో పార్టీ నేతలకే వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఊదరగొడుతూ పంపిణీ చేస్తున్నారు. ఆర్భాటంగా నిర్వహించుకునే ఆ కార్యక్రమాల్లో కనిపించడం మినహా.. కరోనా విపత్కర పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు భరోసానిచ్చే కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఉపాధి లేక లక్షలాది మంది అసంఘటిత కార్మికులు రోడ్డున పడుతున్నారు.
కరోనా నిబంధనలతో వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయి. అద్దెలు చెల్లించలేక అప్పుల భారంతో వ్యాపారులు కుదేలవుతున్నారు. మరోవైపు పలు వ్యాపారాలు, వివిధ రకాల చేతివృత్తులు నమ్ముకుని జీవించే ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగానికి తోడుగా ప్రజాప్రతినిధులు ముందుకురావాల్సి ఉంది. ఏయే వర్గాలు ఏ విధంగా నష్టపోతున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. ఆ వర్గాలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంది. మరికొందరు ప్రజాప్రతినిధులైతే తాము అందుబాటులోలేమని, తమ పీఏలతో మాట్లాడాలని నెంబర్లు ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.
గెలిచి ముఖం చాటేశారు..
ఇటీవల మండలి ఎన్నికలతో పాటు అటు సాగర్‌లో గెలిచి భుజాలు చరుచుకున్న వారంతా ఇప్పుడు కనిపించడమే భాగ్యంగా మారింది. ప్రైవేట్ ఉపాధ్యాయులు, నిరుద్యోగుల కోసమంటూ హైదరాబాద్‌లో ఉపన్యాసాలు ఇచ్చిన ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అడ్రస్ కోసం వెతుకులాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నామంటూ పలువురు ఆరోపిస్తున్నారు. అసలే కరోనా బాధితులకు చికిత్సలు అందక, ఆక్సిజన్దొరక్క, మందులు దొరక్క విలవిల్లాడుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఆయా జిల్లాలు, నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌ల యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ మేరకు సూచనలు చేసి ఉంటే ప్రజలకు ప్రైవేట్ వైద్యం అందే అవకాశం ఉందంటున్నారు.
రాజకీయాలకు మాత్రం ముందుకే..
రాష్ట్రంలో ప్రస్తుతం మాజీ మంత్రి ఈటల రాజేందర్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్పుట్ట మధుల అంశం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిలో విమర్శలకు మాత్రం నేతలు పోటీ పడుతున్నారు.
రాష్ట్రంలో ఇటీవల కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు జిల్లాలు, సెగ్మెంట్లలో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటున్నారా అనే అంశంపై ‘దిశ’ పరిశీలన చేసింది.
– జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని రూఢీ అయింది. నియోజకవర్గం పరిధిలో తిరుగడం లేదని, వీలయినంత మేరకు బయటకు వెళ్లడమే తగ్గించుకున్నట్లు చెప్పుతున్నారు.
– ఉమ్మడి కరీంనగర్జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్సంజయ్ మాత్రమే కరోనా అంశంలో ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి గంగుల నియోజకవర్గానికి అప్పుడప్పుడు వస్తున్నా.. రాజకీయపరమైన కార్యక్రమాలు, కొన్ని అంశాలకే పరిమితమవుతున్నారు. కరోనా బాధితుల కోసం ప్రత్యేకమైన చర్యలేమీ లేవు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి కొద్ది రోజులు తిరిగినా ఇప్పుడు అటు వెళ్లడం లేదు. రామగుండం ఎమ్మెల్యే స్థానికంగా ఉంటున్నా ప్రజలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఇక వేములవాడ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో పార్టీ నేతలకు కూడా తెలియదు. మిగిలిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఇటీవల కాలంలో సెగ్మెంట్లకు వెళ్లడం లేదు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సెగ్మెంట్‌కు అప్పుడప్పుడు నిర్ధేశించిన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. క్యాంపు కార్యాలయాల్లో సేవలు నామమాత్రంగానే ఉంటున్నాయి.
– ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న అంశాలపై కొంతమంది వర్గీయుల నుంచి ఫోన్‌లో తెలుసుకుంటున్నారు. గ్రామాల పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం కరోనా కష్టాలపై దృష్టి పెట్టారు. ఇక ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు మాత్రం ఇండ్ల నుంచి బయటకు రావడమే మానేశారు.
– మేడ్చల్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు దాదాపుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మంత్రి మల్లారెడ్డి సెగ్మెంట్‌కు వస్తున్నా కరోనా అంశాలపై చేస్తున్న సాయం మాత్రం లేదు. అటు కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్కొన్ని సందర్భాల్లో నియోజకవర్గానికి అందుబాటులోకి వస్తున్నారు. ఈ పరిధిలో కార్పొరేటర్లు కూడా ఒకరిద్దరు మినహా.. చాలా మంది ఇండ్లకే పరిమితమవుతున్నారు.
– ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితి. మెజార్టీగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి కరోనా బాధితులను ఫోన్లలో పరామర్శిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో బాధితులకు అండగా ఉంటున్నది తక్కువే.