పడిపోయిన తెలంగాణ ప్రతిష్ట.. నీతి ఆయోగ్ చెప్పింది ఇదే..

దిశ, తెలంగాణ బ్యూరో : వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రామాణికంగా తీసుకుని నీతి ఆయోగ్ వెల్లడించిన నివేదికలో తెలంగాణ పనితీరు 11వ స్థానానికి పడిపోయింది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన స్థిరీకృత అభివృద్ధి లక్ష్యాల్లో మన దేశానికి 2019-20 సంవత్సరానికి 67వ స్థానం లభిస్తే ఈసారి (2020-21) 69వ ర్యాంకుకు పడిపోయింది. ఆ తీరులోనే 2018-19, 2019-20 సంవత్సరాల్లో మన దేశంలో వరుసగా రెండుసార్లూ మూడవ స్థానంలో నిలిచిన తెలంగాణ 2020-21 సంవత్సరంలో మాత్రం ఏకంగా […]

Update: 2021-06-03 15:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రామాణికంగా తీసుకుని నీతి ఆయోగ్ వెల్లడించిన నివేదికలో తెలంగాణ పనితీరు 11వ స్థానానికి పడిపోయింది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన స్థిరీకృత అభివృద్ధి లక్ష్యాల్లో మన దేశానికి 2019-20 సంవత్సరానికి 67వ స్థానం లభిస్తే ఈసారి (2020-21) 69వ ర్యాంకుకు పడిపోయింది. ఆ తీరులోనే 2018-19, 2019-20 సంవత్సరాల్లో మన దేశంలో వరుసగా రెండుసార్లూ మూడవ స్థానంలో నిలిచిన తెలంగాణ 2020-21 సంవత్సరంలో మాత్రం ఏకంగా ఎనిమిది స్థానాలు పడిపోయి 11వ ప్లేస్‌ దక్కించుకున్నది. మొత్తం 17 లక్ష్యాలను ప్రామాణికంగా తీసుకుని అన్ని రాష్ట్రాల పనితీరును విశ్లేషించిన నీతి ఆయోగ్ తెలంగాణ 69 మార్కులు మాత్రమే సాధించగలిగింది. అందుకే 11వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

వెనక పడటానికి ఇదే కారణం..

అందరికీ నాణ్యమైన విద్యుత్ అనే అంశంలో మినహా మిగిలిన 16 లక్ష్యాల్లోనూ తెలంగాణ పనితీరు అథమంగానే ఉంది. లింగ సమానత్వం లేకపోవడం, జనాభాకు తగిన వైద్య సిబ్బంది లేకపోవడం, వాతావరణ పరిరక్షణ విషయంలో కనీస స్థాయిలోనే పనితీరు కనబర్చినట్లు నీతి ఆయోగ్ తాజా నివేదికలో పేర్కొన్నది. తెలంగాణలో ప్రతీ లక్ష మందిలో దాదాపు వంద మంది మహిళలపై వివిధ రకాల నేరాలు జరుగుతున్నాయని, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఐదు శాతానికే పరిమితమైందని విశ్లేషించింది.

ఇక వైద్య రంగంలో ప్రతీ పది వేల మందికి పది మంది డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారని పేర్కొన్నది. ప్రతీ లక్ష మందిలో ఇరవై మందికిపైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రతీ లక్ష మందిలో 192 మంది క్షయ వ్యాధి బారిన పడుతున్నారని, నెల మొత్తం మీద రకరకాల అవసరాలకు చేస్తున్న ఖర్చులో 14 శాతానికి పైగా కేవలం వైద్యం కోసమే ఖర్చు పెట్టాల్సి వస్తున్నదని వివరించింది. రోడ్డు ప్రమాదాల్లో మృతుల రేటు దేశంలో మరే రాష్ట్రంలో లేనంత ఎక్కువగా ఉన్నదని, 18.68%గా నమోదైందని తెలిపింది.

సంక్షేమ పథకాలున్నా పేదరికం లేదంట!

రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఎవ్వరూ లేరని నివేదించిన నీతి ఆయోగ్ అనేక సంక్షేమ పథకాలను పేదల కోసమే అమలు చేస్తున్నట్లు పేర్కొన్నది. కానీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అర్హులైనవారిలో 81.38 శాతం మందికి పని కల్పిస్తున్నట్లు పేర్కొన్నది. రాష్ట్ర జనాభాలో కేవలం 66.40% మందికి మాత్రమే వైద్య బీమా అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఒకవైపు దారిద్ర్య రేఖకు దిగువన లేరని పేర్కొంటూనే పేదరికంలో ఉన్నవారి కోసం రేషన్ కార్డుల ద్వారా బియ్యం, ఆసరా పింఛన్లు తదితరాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్నట్లు నొక్కిచెప్పింది.

దేశంలో పేదరికం లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని నీతి ఆయోగ్ గణాంకాల ద్వారా స్పష్టమైంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న సుమారు 88 లక్షల కుటుంబాలకు రేషను కార్డులు ఇస్తున్నట్లు, ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో చెప్పినా నీతి ఆయోగ్ వివరాల్లో మాత్రం భిన్నమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.

నీతి ఆయోగ్ మొత్తం 17 స్థిరీకృత అభివృద్ధి లక్ష్యాలు, దాని ప్రకారం విధించుకున్న 70 రకాల టార్గెట్లు, 115 రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు రాష్ట్రాలకు ఇచ్చిన ర్యాంకింగ్‌లో తెలంగాణ గత రెండేళ్ళూ మెరుగైన పనితీరుతో మూడవ స్థానంలో నిలిస్తే.. గతేడాది మాత్రం ఏకంగా 11వ స్థానానికి పడిపోయినట్లు తాజా నివేదిక ద్వారా స్పష్టమైంది.

ఉత్తమ ఫలితాలతో దక్షిణ భారతదేశానికి చెందిన కేరళ మొదటి స్థానంలో ఉంటే హిమాచల్ ప్రదేశ్ రెండవ స్థానంలో, తమిళనాడు మూడవ స్థానంలో నిలిచింది. గతంలో సులభతర వాణిజ్య విభాగంలో సైతం మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ గతేడాది మాత్రం కిందికి పడిపోయింది.

Tags:    

Similar News