సారీ… మేం వైద్యం చేయలేం… ఈఎస్ఐ డైరెక్టర్
ప్రజలకు వైద్యం అందించాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. తగినంత మంది సిబ్బంది లేని కారణంగా ఆశించిన స్థాయిలో వైద్య సేవలు ఇవ్వలేమని ఏకంగా నోటీసు బోర్డునే పెట్టారు. పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడంతో ఇంతకాలం డిప్యూటేషన్‌మీద తీసుకొచ్చామని, ఇప్పుడు ప్రభుత్వం వెనక్కు తీసుకెళ్ళడంతో సిబ్బంది కొరత వెంటాడుతోందని ఈఎస్ఐ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్‌లు నోటీసు ద్వారా కార్మికులకు తెలియజేశారు. వరంగల్ జాయింట్ డైరెక్టర్ పరిధిలో ఉన్న మిర్యాలగూడ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఈ నోటీసు బోర్డు దర్శనమిచ్చింది. అసలే వైద్యుల […]
ప్రజలకు వైద్యం అందించాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. తగినంత మంది సిబ్బంది లేని కారణంగా ఆశించిన స్థాయిలో వైద్య సేవలు ఇవ్వలేమని ఏకంగా నోటీసు బోర్డునే పెట్టారు. పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడంతో ఇంతకాలం డిప్యూటేషన్‌మీద తీసుకొచ్చామని, ఇప్పుడు ప్రభుత్వం వెనక్కు తీసుకెళ్ళడంతో సిబ్బంది కొరత వెంటాడుతోందని ఈఎస్ఐ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్‌లు నోటీసు ద్వారా కార్మికులకు తెలియజేశారు. వరంగల్ జాయింట్ డైరెక్టర్ పరిధిలో ఉన్న మిర్యాలగూడ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఈ నోటీసు బోర్డు దర్శనమిచ్చింది. అసలే వైద్యుల కొరతతో సతమతమవుతున్న ఈఎస్ఐ ఆసుపత్రులు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు కూడా లేకుండా పోయింది. దీనికి తోడు గత కొంతకాలంగా మందుల కొరత ఉండనే ఉంది.
వాస్తవానికి ఈఎస్ఐ ఆసుపత్రులకు దీర్ఘకాలంగానే అనేక సమస్యలు ఉన్నాయి. తగినంత మంది వైద్యులు లేకపోవడంతో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందడంలేదు. ఇప్పుడు ప్రభుత్వం డిప్యూటేషన్‌పై ఉన్న ఉద్యోగులందరినీ పేరెంట్ డిపార్టుమెంట్‌లకు పంపిస్తుండడంతో ఈఎస్ఐ ఆసుపత్రులకు తిప్పలు వచ్చిపడ్డాయి. హైదరాబాద్ నగరంలోని తార్నాక, చిక్కడ్‌పల్లి, రెజిమంటల్ బజార్, డబీర్‌పుర తదితర ఈఎస్ఐ డిస్పెన్సరీలలో చాలా కాలంగా ల్యాబ్ టెక్నీషియన్లు లేకపోవడంతో ల్యాబ్ సౌకర్యాలు కరువయ్యాయి. గత కొన్ని నెలలుగా ఆ ల్యాబ్‌లు మూతపడ్డాయి. అదే సమయంలో గోల్కొండ, చర్లపల్లి, మేడ్చరల్ తదితర ఈఎస్ఐ డిస్పెన్సరీలలో ఫార్మసిస్టులు లేకపోవడంతో ఫార్మసీలు మూతపడ్డాయి. ఇప్పుడు ఏకంగా మిర్యాలగూడ ఈఎస్ఐ డిస్పెన్సరీలో నోటీసుబోర్డే వెలిసింది.
ఇటీవల ఈఎస్ఐ మందుల కొనుగోళ్ళలో చోటుచేసుకున్న స్కామ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మందుల కొనుగోళ్ళ కోసం స్పష్టమైన విధివిధానాలను రూపొందించలేదు. దీంతో గందరగోళం చోటుచేసుకుంది. మందుల్ని ఏ పద్ధతిలో కొనుగోలు చేయాలో ఇప్పటికీ అధికారులకు స్పష్టత లేకుండా పోయింది. దీంతో గోరుచుట్టు రోకలి పోటులా ప్రభుత్వం తీసుకున్న డిప్యూటేషన్ విధానం ఈఎస్ఐ డిస్పెన్సరీలపై ఆధారపడిన కార్మికుల మెడకు చుట్టుకుంది. కనీసం ప్రభుత్వ ఆసుపత్రులకు రాష్ట్ర వైద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా చేస్తున్నట్లుగానే ఈఎస్ఐ డిస్పెన్సరీలకు కూడా అదే సంస్థ ద్వారా మందులు సరఫరా చేయగలిగినట్లయితే కొంతైనా ఉపశమనం కలిగి ఉండేది.
స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ల కొరతతో పాటు మందుల సరఫరాలో కూడా సమస్యలు రావడంతో ఏ క్షణంలో ఏ డిస్పెన్సరీ మూతబడుతుందో అర్థంకాని గందరగోళం నెలకొనింది. ఇదే విషయమై సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ, డిస్పెన్సరీలు మూతపడకముందే ప్రభుత్వం మేల్కొని సిబ్బంది కొరత సమస్యకు పరిష్కారం చూపాలని, అప్పటివరకు డిప్యూటేషన్ల రద్దు నిర్ణయాన్ని అమలులోకి రాకుండా నిలుపుదల చేయాలని, సకాలంలో మందుల్ని సరఫరా చేసి కార్మికులకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.