Sunita Williams: ఆ కారణాలతో వాయిదా పడిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర.. మళ్ళీ ఎప్పుడంటే..?
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి రోదసీ యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు.
దిశ వెబ్ డెస్క్: ఇప్పటికే రెండుసార్లు అంతరిక్షంలోని వింతలు చూసి వచ్చిన భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి రోదసీ యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 8.04 గంటలకు సునీతా విలియమ్స్‌ను రోదసి తీసుకువెళ్ళే బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌకను, లిఫ్ట్-ఆఫ్‌కు కేవలం 90 నిమిషాల ముందు అట్లాస్ V రాకెట్ ప్రయోగాన్ని నాసా నిలిపివేసింది.
ఇంజిన్‌లో వాల్వ్ సమస్య తలెత్తిన కారణంచేత సునీతా విలియమ్స్ మూడోసారి రోదసీ యాత్ర వాయిదా పడింది. ఈ విషయంపై యూనైటెడ్ లాంఛ్ అలయన్స్ ఇంజినీర్ దిల్లాన్ రైస్ మాట్లాడుతూ.. అట్లాస్ రాకెట్‌లోని అప్పర్ స్టేజ్‌లో ఆక్సిజన్ వాల్వ్ సమస్య ఏర్పడిందని తెలిపారు. ఇలా స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ నిర్మాణంలో సమస్యలు తలెత్తడం ఇది మొదటిసారి కాదు.
గతంలోను క్యాప్యూల్ సమస్య ఎర్పడింది. దీనితో సునీతా విలియమ్స్ 3వ రోదసి యాత్ర ఆలస్యం అయ్యింది. కాగా నాసా చేపట్టిన ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వస్తుంది. ఇక ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక మాత్రమే ఈ సేవలు అందిస్తోంది. అయితే స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి.
కాగా గతంలో సునీతా విలియమ్స్ 322 రోజులు అంతరిక్షంలో గడిపి రికార్డు సృష్టించారు. ఇక ఈ రోజు ప్రయోగం విజయవంతమై ఉంటే.. కొత్త స్పేస్ షటిల్ యొక్క మెయిడెన్ క్రూడ్ మిషన్‌లో ప్రయాణించిన మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించేవారు. కాని దురదృష్టవశాత్తు ఈ రోజు రోదసిలోకి దూసుకెళ్ళాల్సిన అట్లాస్ V రాకెట్ సాంకేతిక లోపాల కారణంగా నిలిచిపోయింది. అయితే అట్లాస్ V రాకెట్ మళ్లీ ఎప్పుడు లాంచ్ చేస్తారు అనే విషయాన్ని నాసా పేర్కొనలేదు.