PSLV C-55 రాకెట్ ప్రయోగం సక్సెస్.. ఇస్రో చరిత్రలో మరో ఘనత

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-55 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది.

Update: 2023-04-22 10:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-55 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. రెండు సింగపూర్ ఉపగ్రహాలను మోసుకుని శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం మధ్యాహ్నం 2:20 గంటలకు పీఎస్ ఎల్వీసీ55 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. సింగపూర్‌కు చెందిన 741 కిలోల టెలియోస్-2, 16 కిలోల లూమ్ లైట్-4 ఉపగ్రహాలు మోసుకెళ్లిన రాకెట్ వాటిని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. టెలియోస్-2 ఉపగ్రహాన్ని ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో ఈ అభివృద్ధి చేశారు. దీనిలో శాటిలైట్‌లో సింథటిక్ అపర్చర్ రాడార్ పేలోడ్‌ను ఉంచారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో రేయింబవళ్లు కవరేజీ అందించగలిగేలా దీనిని రూపొందించారు.

లూమ్ లైట్-4 శాటిలైట్‌ను ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫోకామ్ రీసెర్చ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో డెవలప్ చేశారు. ఇది సింగపూర్ ఇ-నావిగేషన్ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చేలా తయారు చేశారు. ఇస్రో చరిత్రలో మరో వాణిజ్య ప్రయోగం విజయవంతం కావడంతో సైంటిస్టులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News