Google Chrome బ్రౌజర్ వాడుతున్న వారికి కేంద్రం కీలక హెచ్చరిక!
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే బ్రౌజర్ Google Chrome. డెస్క్‌టాప్ వినియోగదారులకు మాత్రమే కాకుండా స్మార్ట్ ఫోన్ యూజర్లు కూడా అత్యధికంగా దీనిని వాడుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే బ్రౌజర్ Google Chrome. డెస్క్‌టాప్ వినియోగదారులకు మాత్రమే కాకుండా స్మార్ట్ ఫోన్ యూజర్లు కూడా అత్యధికంగా దీనిని వాడుతున్నారు. ఏ విషయం గురించి తెలుసుకోవాలన్న సరే ప్రతి ఒక్కరు గూగుల్ క్రోమ్‌ను ఆశ్రయించక తప్పదు. మన వ్యక్తిగత డేటా, బ్యాంకు వివరాలు అన్ని కూడా క్రోమ్ బ్రౌజర్‌కు సింక్ అయి ఉంటాయి. మరి అలాంటి బ్రౌజర్ హ్యాకింగ్ బారిన పడితే మన సమాచారం మొత్తం దొంగల చేతుల్లోకి వెళ్తుంది. ఇటీవల కాలంలో Google Chromeపై ఎక్కువగా దాడి చేయడానికి హ్యాకర్స్ ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Google Chrome వాడే వినియోగదారులు తమ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కేంద్రం పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. కానీ కొంత మంది ప్రభుత్వ హెచ్చరికలు పాటించకుండా బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడం లేదని కేంద్రం పేర్కొంది. అయితే ఈ సారి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్‌లో ఒక లోపాన్ని కనుగొంది. దీని కారణంగా వినియోగదారుల బ్యాంకు సమాచారం, పుట్టిన తేదీ, లొకేషన్ మొదలగు వివరాలు హ్యాకింగ్ బారిన పడే అవకాశం ఉన్నందున కచ్చితంగా Chrome బ్రౌజర్ 110.0.5481.177 కంటే ముందు వెర్షన్ వాడుతున్న వారు కచ్చితంగా తమ బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోవాలని హెచ్చరిస్తుంది.