ఆండ్రాయిడ్ టీవీల్లో గూగుల్ గుత్తాధిపత్యానికి తెర.. ఇకపై డీఫాల్ట్‌గా ప్లే స్టోర్ ఉండబోదు..
ఆండ్రాయిడ్ (Android tv) టీవీల్లో గూగుల్ గుత్తాధిపత్యానికి ఎట్టకేలకు తెరపడింది.

దిశ, వెబ్ డెస్క్: ఆండ్రాయిడ్ (Android tv) టీవీల్లో గూగుల్ గుత్తాధిపత్యానికి ఎట్టకేలకు తెరపడింది. భారతదేశ స్మార్ట్ టీవీ మార్కెట్‌లో గూగుల్ (Google) అనుసరిస్తున్న విధానాలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. మొబైల్, టీవీ ఆండ్రాయిడ్ డివైజ్‌లలో డామినెంట్ పొజిషన్‌లో ఉండేందుకు గూగుల్ విధించిన నిబంధనలపై కొన్నేండ్లుగా కేసు నడుస్తోన్న సంగతి తెలిసిందే. డివైజ్‌లను తయారు చేస్తున్న సమయంలోనే ఆండ్రాయిడ్ ఓఎస్ (Android TV OS)లలో గూగుల్ ప్లేస్టోర్ కంపల్సరీగా ఉండేలా నిబంధనలు విధించింది. దీనితో పాటు కాంపిటిటివ్ ఓఎస్‌లను నిలువరించేలా ఒప్పందం చేసుకుంది. దీనిపై కంపెనీలు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)ను ఆశ్రయించాయి.
గూగుల్‌కు భారతదేశం అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. ఇక్కడ స్మార్ట్ టీవీల కోసం గూగుల్ రూపొందించిన టెలివిజన్ యాప్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ (TADA) కింద, తమ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్, ఇతర అప్లికేషన్‌లను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. దీని ద్వారా గూగుల్ తన 'ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం' చేస్తోందని సీసీఐ తన దర్యాప్తులో గుర్తించింది. ఇద్దరు భారతీయ యాంటీట్రస్ట్ న్యాయవాదులు గూగుల్, ఆల్ఫాబెట్‌పై ఫిర్యాదు చేయడంతో సీసీఐ ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో స్మార్ట్ టీవీల్లో గూగుల్ యాప్స్ అన్నీ బండిల్‌గా ఇన్ బిల్ట్‌లో ఉండేలా.. ఆండ్రాయిడ్ వర్షన్ వాడాలంటే ప్లే స్టోర్ టాప్ పొజిషన్‌లో ఉండేలా ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీలపై గూగుల్ నిబంధనలు విధించినట్లు తేలింది. ఈ విధానం ఆపరేటింగ్ సిస్టమ్‌లను అభివృద్ధి చేయాలనుకునే చిన్న సంస్థలకు అడ్డంకిగా మారుతుందని తేల్చింది.
అయితే, దీనిపై చాలా ఏళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది. గతంలో పలుమార్లు భారీ జరిమానా విధించిన సీసీఐ.. తాజాగా 20 కోట్ల 24 లక్షల రూపాయలతో ఈ కేసును గూగుల్ సెటిల్ చేసుకోనుంది. అలాగే, స్మార్ట్ టీవీలలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) గూగుల్ ప్లే స్టోర్‌ను డిఫాల్ట్‌గా అందించడాన్ని ఇకపై కొనసాగించబోమని గూగుల్ అంగీకరించింది. సీసీఐ ఆదేశాల నేపథ్యంలో టెక్ దిగ్గజం ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త ఒప్పందం ప్రకారం.. భారతదేశంలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం ప్లే స్టోర్, ప్లే సర్వీసులను ఒకే ప్యాకేజీగా కాకుండా, విడిగా లైసెన్స్ ఇచ్చేందుకు గూగుల్ ప్రతిపాదించింది. దీంతో ఇప్పటి వరకు ఉచితంగా ప్రి-ఇన్‌స్టాలేషన్ కోసం అందించిన గూగుల్ ప్లే స్టోర్, ప్లే సర్వీసులకు ఇకపై లైసెన్స్ ఫీజు వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ మార్పులు వినియోగదారులపై ప్రభావం పడనుంది. గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్, ప్లే స్టోర్‌ను ఇష్టపడే వినియోగదారులు ఇకపై టీవీ కొనుగోలు చేసే ముందు, తాము ఎంచుకున్న మోడల్‌లో అవి ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయా లేదా అని రిటైలర్లు, బ్రాండ్‌లను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇకపై ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లు, యాప్ స్టోర్‌లు కూడా స్మార్ట్ టీవీ తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది.