స్వాబ్ శాంపిళ్లు సేకరించే రోబో!
కరోనాను కట్టడిలో ముందుండి పనిచేస్తున్న వైద్యులు ఎక్కువగా ఆ వ్యాధి బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో 31 మంది వైద్యులకు ఈ వైరస్ సోకిందని మన దిశలో కథనం కూడా చూశాం. వీళ్లందరికీ ఎలా సోకింది? వాళ్లకు వాళ్లుగా కావాలని పేషెంట్లను ముట్టుకోరు కదా ! అంటే దాదాపు 90 శాతం మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడటానికి ప్రధానం కారణం శాంపిల్ సేకరణ. ఒక వ్యక్తికి కరోనా ఉందో లేదో నిర్ధారించేందుకు స్వాబ్ […]
కరోనాను కట్టడిలో ముందుండి పనిచేస్తున్న వైద్యులు ఎక్కువగా ఆ వ్యాధి బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో 31 మంది వైద్యులకు ఈ వైరస్ సోకిందని మన దిశలో కథనం కూడా చూశాం. వీళ్లందరికీ ఎలా సోకింది? వాళ్లకు వాళ్లుగా కావాలని పేషెంట్లను ముట్టుకోరు కదా ! అంటే దాదాపు 90 శాతం మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడటానికి ప్రధానం కారణం శాంపిల్ సేకరణ. ఒక వ్యక్తికి కరోనా ఉందో లేదో నిర్ధారించేందుకు స్వాబ్ శాంపిళ్లు అవసరం. గొంతులో, ముక్కులో దూది చుట్టిన సన్నని తీగ వాడి ఆ శాంపిళ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకుతోంది. ఈ నేపథ్యంలో వారి పనిని మరింత సులభతరం చేసే రోబోను ‘సదరన్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్, లైఫ్‌లైన్ రోబోటిక్స్’ వారు తయారు చేయడం విశేషం.
‘స్వాబ్ రోబోట్’ అని పిలిచే ఈ రోబో.. సంబంధిత వ్యక్తి నుంచి స్వాబ్ శాంపిళ్లను సేకరిస్తుంది. పేషెంట్ ఐడీ కార్డు చూపించగానే.. రోబో శాంప్లింగ్ కిట్‌ను సిద్ధం చేసుకుని, స్వాబ్ సేకరించడంతో పాటు దాన్ని కంటెయినర్లో కూడా పెడుతుందని రోబోటిక్స్ ప్రొఫెసర్ థియుసియస్ రజీత్ సవరిముత్తు వివరించారు. ఫ్రేములో చూపించిన ప్రదేశం వద్ద దవడ ఆన్చి నోరు తెరిస్తే చాలు, రోబో తన పని తాను చేసుకుపోతుంది. గొంతులో స్వాబ్ సేకరించడానికి సరైన ప్రాంతాన్ని గుర్తించడానికి ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానించిన కెమెరాలు ఉన్నాయి. ఈ రోబోను వాడటం మొదలుపెడితే కావాల్సినన్ని శాంపిళ్లు తీసుకుని, వైద్యులకు ఎలాంటి ప్రమాదం లేకుండానే పరీక్షల సంఖ్య పెంచే సదుపాయం కలుగుతుందని రజీత్ వెల్లడించారు.