సుశాంత్ కేసు సీబీఐకు అప్పగించాలని సుప్రీంలో పిటిషన్లు
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో మంగళవారం రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలయ్యాయి. బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది అజయ్ అగర్వాల్ ఓ పిల్ దాఖలు చేయగా.. ముంబైకి చెందిన న్యాయశాస్త్ర విద్యార్థి ద్వివేంద్ర దేవ్‌తాదీన్ దూబే మరో పిటిషన్ దాఖలు చేశారు. సుశాంత్ తండ్రి అభ్యర్థన మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ కేంద్రానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ సిఫారసు […]
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో మంగళవారం రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలయ్యాయి. బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది అజయ్ అగర్వాల్ ఓ పిల్ దాఖలు చేయగా.. ముంబైకి చెందిన న్యాయశాస్త్ర విద్యార్థి ద్వివేంద్ర దేవ్‌తాదీన్ దూబే మరో పిటిషన్ దాఖలు చేశారు. సుశాంత్ తండ్రి అభ్యర్థన మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ కేంద్రానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ సిఫారసు చేసిన కొద్ది గంటలకే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా, సుశాంత్ మృతికి దారితీసిన కారణాలను వెలుగులోకి తెచ్చేందుకు సీబీఐ విచారణ చేపట్టాలని ధర్మాసనానికి అగర్వాల్ విన్నవించారు. సుశాంత్ అకౌంట్‌లోని మొత్తం రూ.17 కోట్లలో.. అతడి గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి రూ.15 కోట్లు విత్‌డ్రా చేసినట్లు వస్తున్న ఆరోపణలను కూడా అగర్వాల్ తన పిటిషన్‌లో ప్రస్తావించారు. మరోవైపు ముంబై లా స్టుడెంట్ దూబే సైతం ఇదే రీతిలో సీబీఐ విచారణ కోసం సుప్రీం ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను సీబీఐకి లేదా ఎన్ఐఏకి బదిలీ చేయాలని పిటిషన్‌లో కోరారు. కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాంటే ఈ కేసును సీబీఐకు బదిలీ చేయాల్సిందేనని అందులో పేర్కొన్నారు. కాగా, సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ గత నెల 31న ఇలాగే దాఖలైన ఓ పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే బాంబే హైకోర్టుకు వెళ్లండి అంటూ.. ధర్మాసనం తెలిపింది.