సర్వేల్లో నెగిటివ్ రిపోర్ట్.. వణికిపోతున్న టీఆర్ఎస్ నేతలు
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కారు పార్టీ వేసుకున్న లెక్కలు తారుమారవుతున్నట్లు సమాచారం. పార్టీ రోజూవారీగా చేయిస్తున్న సర్వేల్లో, బూత్‌స్థాయి కార్యకర్తలు అందజేస్తున్న పక్కా రిపోర్టులోనూ ఇదే విషయం వెల్లడవుతుండటంతో ఆ పార్టీ ముఖ్య నేతల్లో కంగారు మొదలైందంట. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన మాత్రం ఏం జరుగుతుందోనని వణికిపోతున్నట్లు ఆ పార్టీకి చెందిన కీలకమైన వ్యక్తుల ద్వారా తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గడిచిన మూడు రోజులుగా వరంగల్‌లో కార్పొరేషన్ ఎన్నికల […]
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కారు పార్టీ వేసుకున్న లెక్కలు తారుమారవుతున్నట్లు సమాచారం. పార్టీ రోజూవారీగా చేయిస్తున్న సర్వేల్లో, బూత్‌స్థాయి కార్యకర్తలు అందజేస్తున్న పక్కా రిపోర్టులోనూ ఇదే విషయం వెల్లడవుతుండటంతో ఆ పార్టీ ముఖ్య నేతల్లో కంగారు మొదలైందంట. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన మాత్రం ఏం జరుగుతుందోనని వణికిపోతున్నట్లు ఆ పార్టీకి చెందిన కీలకమైన వ్యక్తుల ద్వారా తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గడిచిన మూడు రోజులుగా వరంగల్‌లో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. టీఆర్‌ఎస్ అధికార పార్టీకి ధీటుగా కాంగ్రెస్, బీజేపీలతో పాటు టీఆర్ ఎస్ రెబల్, స్వతంత్ర అభ్యర్థులు డివిజన్లలో ప్రచారం సాగిస్తున్నారు. ప్రతీ డివిజన్‌లో 12వేల నుంచి 13వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్‌లో 6 నుంచి 10 మంది వరకు కూడా బరిలో ఉన్నారు. ఇందులో కనీసం 5గురు అభ్యర్థులు గెలుపుకోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. అనేక డివిజన్ల నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాయకులు టికెట్ దక్కకపోవడంతో రెబల్‌గా మారారు. దీంతో పార్టీ టికెట్ ఇవ్వకపోవడాన్ని సవాల్‌గా తీసుకుంటున్న రెబల్ అభ్యర్థులు తమ గెలుపుతో పార్టీ పెద్దలకు సత్తా చాటాలని భావిస్తున్నారు. దీంతో ఎన్నికలో గెలవడానికి ఎంత ఖర్చయినా ఫర్వాలేదంటూ.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. మిగతా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా గట్టిగానే సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
రెబల్స్, స్వతంత్రులతోనే లెక్క మారుతోందంట…?
ఎన్నికల ప్రచారం సాగుతున్న తీరు , పార్టీపై జనాల్లో నెలకొన్న అభిప్రాయం, డివిజన్లలో రోజూవారీగా మారుతున్న రాజకీయ పరిస్థితులు, అధికార పార్టీ అభ్యర్థిపై జనం ఏమనుకుంటున్నారు..? ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు ఉన్న ఆదరణ, ఆదరణ ఎక్కువగా ఉండటానికి గల కారణాలు..? ఇత్యాది అంశాలపై అధికార టీఆర్ ఎస్ పార్టీ రోజూ వారీగా పార్టీలోని కొంతమందితో సర్వే చేయిస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ సర్వే ద్వారా తెలుస్తున్న విషయాలతో ఎప్పటికప్పుడు అభ్యర్థిని, స్థానిక నేతలను ఎమ్మెల్యేలు, ఆయన అనుచరగణం అలర్ట్ చేస్తోంది. ఇప్పటి వరకు వెల్లడైన సర్వే వివరాలతో పాటు బూత్ స్థాయి కార్యకర్తలు అందజేస్తున్న సమాచారంలో అధికార పార్టీకి చాలా చోట్ల రెబల్స్, విపక్షాల అభ్యర్థుల నుంచి గట్టి పోటీ నెలకొని ఉంది. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోని 50 డివిజన్లలో 40 స్థానాల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోందన్న విషయం పార్టీ చేయించిన సర్వేలో వెల్లడైనట్లుగా తెలుస్తోంది. టీఆర్ ఎస్ నుంచి టికెట్లు పొందిన వారిలో పలువురు నేర చరిత కలిగిన వారుండటం కూడా వారిపై వ్యతిరేకత వ్యక్తమవడానికి ప్రధాన కారణమని సమాచారం అందుతోంది.
బూత్‌ల వారీగా పథకాల లబ్ధిదారుల వివరాల సేకరణ..
టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ఓటర్ల వివరాలు, వారి ఫోన్ నెంబర్లను ఇప్పటికే సేకరించిన బూత్‌స్థాయి కార్యకర్తలు రెగ్యులర్ ప్రచారంతో పాటు ఫోన్లలో టీఆర్ ఎస్ పార్టీకి ఓటెయ్యాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కళ్యాణలక్ష్మీ, రేషన్ కార్డుతో పాటు మిగతా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వివరాలను సేకరిస్తున్న స్థానిక నాయకులు టీఆర్ ఎస్‌ను గెలిపిస్తేనే మీ పనవుతుందని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. తూర్పు నియోజకవర్గం పరిధిలోని చాలా డివిజన్లలో ఇలాంటి ప్రచారమే జరుగుతుండటం గమనార్హం.