టీకాల్లేవ్.. పంపిణీ ఎలా?
న్యూఢిల్లీ: మూడో దశ టీకా పంపిణీ కార్యక్రమం వచ్చే నెల 1న ప్రారంభం కావల్సి ఉంది. కానీ, చాలా రాష్ట్రాలు టీకా కొరతతో మూడో దశ పంపిణీ ప్రారంభంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం తాము అందజేసే టీకాలు విధిగా హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45ఏళ్లు పైబడినవారికే తొలి ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించడం, ఇటు టీకా ఉత్పత్తిదారులు ఇప్పుడు సరఫరా చేయలేమని చెబుతుండటంతో ఈ ఆందోళనలు వెల్లడవుతున్నాయి. వీటికి తోడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో మూడో దశ […]
న్యూఢిల్లీ: మూడో దశ టీకా పంపిణీ కార్యక్రమం వచ్చే నెల 1న ప్రారంభం కావల్సి ఉంది. కానీ, చాలా రాష్ట్రాలు టీకా కొరతతో మూడో దశ పంపిణీ ప్రారంభంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం తాము అందజేసే టీకాలు విధిగా హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45ఏళ్లు పైబడినవారికే తొలి ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించడం, ఇటు టీకా ఉత్పత్తిదారులు ఇప్పుడు సరఫరా చేయలేమని చెబుతుండటంతో ఈ ఆందోళనలు వెల్లడవుతున్నాయి. వీటికి తోడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో మూడో దశ టీకా పంపిణీ డిమాండ్‌కు సరిపడా స్థాయిలో ఉత్పత్తి జరగడం లేదనీ అభిప్రాయాలు వస్తున్నాయి. మే 1 నుంచి పెద్ద సంఖ్యలో అర్హులు పెరుగుతుండటంతోపాటు టీకా ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసిన వాటిలో కేంద్రానికి 50శాతం ఇవ్వడం, ఆయా సంస్థల గ్లోబల్ కమిట్‌మెంట్స్ కూడా సరఫరాలపై అనిశ్చితిని పెంచుతున్నది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పాలిత పంజాబ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లు, బీజేపీ అధికారంలోని గోవా, అసోంలతోపాటు మహారాష్ట్ర, కేరళ మే 1వ తేదీ నుంచి మూడో దశ పంపిణీపై సంశయాలను వ్యక్తం చేశాయి. రాష్ట్రాలకు సరిపడ స్థాయిలో దేశంలో టీకాల ఉత్పత్తే లేదని కేరళ మంత్రి థామస్ ఇసాక్ తెలిపారు. అలాంటప్పుడు 18ఏళ్లుపైబడినవారందరినీ అర్హులు చేసి.. అందుకోసం రాష్ట్రాలే కంపెనీ నుంచి టీకాలు నేరుగా కొనుగోలు చేయాలని ఆదేశించి పంపిణీ నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవడమేంటని ప్రశ్నించారు. 18ఏళ్లకు పైబడినవారికి టీకా వేయడానికి రోజుకు 65లక్షల డోసులు ఉత్పత్తి అవసరమని, కానీ వాస్తవంలో ఇది దాదాపు 30 లక్షలుగా ఉన్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం సీరం నెలకు 7 (700 లక్షలు)కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తున్నది.
మే 15 తర్వాతేనా?
మూడో దశ టీకా పంపిణీపై ఇటీవలే కాంగ్రెస్ పాలిత రాజస్తాన్, పంజాబ్, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు భేటీ అయ్యారు. మే 1న మొదలయ్యే పంపిణీ కార్యక్రమానికి సంసిద్ధతపై చర్చలు చేశారు. అప్పటి డిమాండ్‌కు సరిపడా టీకాల కోసం వారు టీకా ఉత్పత్తిదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సంప్రదించగా చేదు వార్తే ఎదురైందని తెలిపారు. డోసుల సరఫరా కోసం మే 15వ తేదీ వరకు వెయిట్ చేయాలని సంస్థ తెలియజేసినట్టు రాజస్తాన్ హెల్త్ మినిస్టర్ రఘు శర్మ వివరించారు. ఈ డెడ్‌లైనే తమ అందరికీ సంస్థ తెలిపిందని పంజాబ్ మినిస్టర్ బల్బీర్ సింగ్ సంధు తెలిపారు. టీకా కొరతపై కేరళ కూడా గొంతెత్తింది.
మహారాష్ట్ర, అసోంలలోనూ డౌటే
సీరం, భారత్ బయోటెక్, రెడ్డీస్ ల్యాబ్‌లకు టీకాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్‌లు పెట్టింది. కానీ, రెస్పాన్స్ రాలేదని ఓ అధికారి వివరించారు. ఆ కంపనీల దగ్గరున్న ప్రస్తుత స్టాక్ కేంద్రానికి కేటాయిస్తున్నట్టు అనధికారికంగా తెలిసిందని చెప్పారు. ఏ రాష్ట్రానికి ఎంతమొత్తంలో కేటాయించాలో కంపెనీలే నిర్ణయిస్తుండటంతో తమకు డోసులు ఎప్పుడు అందుతాయో కచ్చితంగా తేల్చుకోలేకపోతున్నామని తెలిపారు. అయితే, తాము రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నామని, మరో వారంలో డోసులు రావొచ్చని అన్నారు. అసోంకు కంపెనీలు ఎప్పుడు టీకాలు సరఫరా చేస్తే అప్పుడే మూడో దశ పంపిణీ మొదలవుతుందని రాష్ట్ర మంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. అదిగాక, మే 2న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటు తంతుతో మూడో దశ కాస్త లేట్ కావొచ్చని వివరించారు.
సప్లై చేయలేమంటున్నారు..
తమ రాష్ట్రానికి కావాల్సిన టీకాల కోసం ఐదు లక్షల డోసుల ఆర్డర్‌ను పెట్టగా సీరం సానకూలంగా స్పందించలేదని గోవా ప్రభుత్వం తెలిపింది. తాము ఇప్పుడు గోవాకు డోసులను సరఫరా చేసే స్థితిలో లేమని తెలియజేసినట్టు హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ జోస్ వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కమిట్‌మెంట్ ముందుగా ఫుల్‌ఫిల్ చేయాల్సి ఉన్నదని పేర్కొన్నట్టు తెలిపారు.