పార్కు సిబ్బందికి పైసల్లేవ్..!

సెక్యూరిటీ గార్డులకు సమాయానికి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. బల్దియా పరిధిలోని 21పార్కుల్లో పనిచేస్తున్న కార్మికులకు ఏడాది కాలంగా జీతాలు రావడం లేదు. దీంతో కార్మికులు జీహెచ్​ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అర్బన్​ బయోడైవర్సిటీ, నగరంలోని పలు పార్కుల్లో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ యూబీడీ ఆధ్వర్యంలోని పార్కుల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు సమాయానికి జీతం ఇవ్వడం లేదు. ఏడాది కాలం నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు నానా అవస్థలు […]

Update: 2020-10-27 02:13 GMT

సెక్యూరిటీ గార్డులకు సమాయానికి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. బల్దియా పరిధిలోని 21పార్కుల్లో పనిచేస్తున్న కార్మికులకు ఏడాది కాలంగా జీతాలు రావడం లేదు. దీంతో కార్మికులు జీహెచ్​ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అర్బన్​ బయోడైవర్సిటీ, నగరంలోని పలు పార్కుల్లో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ యూబీడీ ఆధ్వర్యంలోని పార్కుల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు సమాయానికి జీతం ఇవ్వడం లేదు. ఏడాది కాలం నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. జీతం కోసం వెళ్తే యూబీడీ విభాగం అధికారులు తమకు సంబంధం లేదని చెప్తున్నారు. సంబంధిత ఏజేన్సీని కలవాలని ఒకసారి, ఈవీడీఎంలోనే సంప్రదించాలని మరోసారి చెప్తుండడంతో కార్మికులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తెలిసిన ఉన్నతాధికారులను కలిసినా ప్రయోజనం లేకుండా పోతుందని కార్మికులు వాపోతున్నారు. జీహెచ్​ఎంసీలో కృష్ణాకాంత్​ పార్క్​, కేబీఆర్​ పార్కు సహా 21 పార్కుల్లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి మూడు నెలల జీతం అందలేదు. ఈ ఏడాదితోపాటు గత సంవత్సరానికి సంబంధించిన జీతాలు కూడా రాలేదని వారు వాపోతున్నారు.

ఏజేన్సీదే బాధ్యత..!

పార్కుల్లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది గతంలో జీహెచ్​ఎంసీ యూబీడీ ఆధ్వర్యంలో ఉండేవారు. జీతాలు, ఈఎస్​ఐ, పీఎఫ్​ వంటి బాధ్యతలన్నీ రేణుకా శక్తి ఏజెన్సీ పరిధిలోనే ఉండేవి. అయితే ఈ ఏడాది మార్చి నుంచి పార్కుల సెక్యూరిటీ సిబ్బందిని ఈవీడీఎంకు బదిలీ చేశారు. కానీ మార్చి నెలకు సంబంధించిన జీతం ఇప్పటికీ అందలేదు. కొన్ని పార్కుల్లో ఈ ఏడాది జనవరి–మార్చి నెలల జీతాలు అందలేదు. కొన్ని పార్కుల్లో గతేడాది నవంబర్​తోపాటు ఈ ఏడాది రెండు నెలలకు సంబంధించిన వేతనాలు రాలేదు. కృష్ణాకాంత్​ పార్కుకు సంబంధించిన 18మందికి 2019 నవంబర్​, 2020 జనవరి, ఫిబ్రవరి నెలల జీతాలు రావాల్సి ఉంది. పార్కుల్లో పనిచేస్తున్న 67మంది కార్మికులకు సుమారు రూ.16.28లక్షలు అందాల్సి ఉంది. వేతనాల కోసం యూబీడీ, ఈవీడీఎం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న కనికరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కాలంగా తిరుగుతున్నా జీహెచ్​ఎంసీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు పట్టించుకోట్లే..

సెక్యూరిటీ గార్డుల జీతాలపై యూబీడీ విభాగం అధికారి కృష్ణను వివరణ కోరగా కార్మికులకు జీతాలు అందని విషయం తమ దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే కార్మికులు మాత్రం ఇంకోలా చెబుతున్నారు. గతంలోనూ అనేకసార్లు వినతి పత్రమిచ్చామని, ఆ సందర్భంలో ఈవీడీఎం కార్యాలయంలో కలవాలని సూచించారని తెలిపారు. ఈవీడీఎంలో సంప్రదిస్తే.. గతంలో యూబీడీ పరిధిలోనే ఉన్నారని, అక్కడే సంప్రదించాలని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు విభాగాల్లోనూ కార్మికులు సంప్రదించినప్పుడు కొందరు అధికారులు వేతనాల విషయం తమకు సంబంధం లేదని సంబంధిత ఏజేన్సీ వాళ్లనే అడగాలని సూచించారు. ఏజేన్సీలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు కొన్నిసార్లు స్పందించడం లేదని కార్మికులు తెలుపుతున్నారు. దీంతో ఏడాది కాలంగా వేతనాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. లాక్​డౌన్​ సమయంలోనూ జీతాలు అందక ఇబ్బందులు పడ్డామని కార్మికులు చెబుతున్నారు.

అధికారులు పట్టించుకుంటలే : నర్సయ్య, సెక్యూరిటీ గార్డు, జీహెచ్​ఎంసీ

జీతాల కోసం అడిగితే ఈవీడీఎం, యూబీడీ, ఏజెన్సీలు ఒకరిపై ఒకరు చెప్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావడంతో అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మూడు నెలల జీతం ఒక్కొక్కరికి సుమారు రూ.25వేల వరకూ రావాల్సి ఉంది. జీతం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. జీహెచ్​ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. వచ్చే ఎనిమిది వేల జీతం కూడా సరిగా ఇవ్వకుంటే మేం ఎలా బతకాలి. అధికారులు పెద్ద మనసు చేసుకుని ఆలోచించాలి.

పెండింగ్​ జీతాలు చెల్లించాలి : ఎం.శ్రీనివాస్​, సీపీఎం నాయకుడు

పార్కుల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డులకు పెండింగ్ జీతాలు చెల్లించాలి. దాదాపు ఏడాది కాలంగా కార్మికులు జీహెచ్​ఎంసీ అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దొరకడం లేదు. కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం న్యాయం కాదు. వచ్చేది తక్కువ జీతాలు కూడా సమయానికి ఇవ్వకపోతే కుటుంబాలు వీధిన పడుతాయి. ఇప్పటికైనా వారికి రావాల్సిన పెండింగ్ జీతాలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. నేరుగా జీహెచ్​ఎంసీ జీతాలు చెల్లించాలి. ఏజెన్సీల పేరుతో కార్మికులను ఇబ్బందులు పట్టొద్దు.

Tags:    

Similar News