ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన నేపాల్ బ్యాటర్.. వీడియో చూసేయండి

నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ టీ20 క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు.

Update: 2024-04-13 14:40 GMT

దిశ, స్పోర్ట్స్ : నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ టీ20 క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఈ రికార్డుకు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) టీ20 ప్రీమియర్ కప్‌ టోర్నీ వేదికైంది. శనివారం ఖతర్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ ఈ విధ్వంసం సృష్టించాడు. దీంతో టీ20ల్లో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, విండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ తర్వాత ఈ రికార్డు సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. మొత్తంగా ఐదో క్రికెటర్.

మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఖతర్‌పై నేపాల్ 32 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 210/7 స్కోరు చేసింది. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన దీపేంద్ర సింగ్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కమ్రాన్ ఖాన్ వేసిన చివరి ఓవర్‌లో రెచ్చిపోయిన అతను వరుసగా ఆరు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఆసిఫ్ షేక్(52) కూడా హాఫ్ సెంచరీ సాధించగా.. కుషాల్ మల్లా(35) రాణించాడు.

అనంతరం ఛేదనకు దిగిన ఖతర్ 179/9 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ తన్వీర్(63) పోరాటం వృథా అయ్యింది. దీపేంద్ర సింగ్ రెండు వికెట్లు తీయడం కూడా గమనార్హం. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అతను జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేపాల్ 19 ఓవర్లలో 174/7 స్కోరు నిలువగా.. ఖతర్ ఛేదనలో 179 పరుగులు చేసింది. దీన్ని బట్టి ఆఖరి ఓవర్‌లో దీపేంద్ర సింగ్ బాదిన ఆరు సిక్స్‌లు నేపాల్ విజయంలో ఎంతటి కీలక పాత్ర పోషించాయో అర్థం చేసుకోవచ్చు. 

Tags:    

Similar News