జైశ్వాల్ నుంచే మీరే నేర్చుకోవాలి.. ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డక్కెట్‌కు కౌంటర్ ఇచ్చిన ఆ జట్టు మాజీ కెప్టెన్
టీమ్ ఇండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్ ఆటతీరుపై ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డక్కెట్ చేసిన వ్యాఖ్యలకు ఆ జట్టు మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ కౌంటర్ ఇచ్చాడు.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్ ఆటతీరుపై ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డక్కెట్ చేసిన వ్యాఖ్యలకు ఆ జట్టు మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ కౌంటర్ ఇచ్చాడు. మూడో టెస్టు మధ్యలో తమ బజ్‌బాల్ ఆటను చూసే జైశ్వాల్ నేర్చుకున్నాడని అర్థం వచ్చేలా డక్కెట్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా స్కై స్పోర్ట్స్ పోడ్‌కాస్ట్‌లో డక్కెట్ వ్యాఖ్యలను నాజిర్ హుస్సేన్ తప్పుబట్టాడు. సొంత జట్టుపైనే విమర్శలు చేశాడు. జైశ్వాల్ అనేక కష్టాలను దాటుకుని ఎదిగాడని, అతని నుంచే మీరు నేర్చుకోవాలని కౌంటర్ ఇచ్చాడు. ‘ఇంగ్లాండ్ నుంచి జైశ్వాల్ నేర్చుకున్నాడని అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. దీని గురించి మాట్లాడాలనుకుంటున్నా. అతను మీ నుంచి నేర్చుకోలేదు. అతను తన పెంపకం నుంచి నేర్చుకున్నాడు. తాను ఎదుగుతున్న సమయంలో ఎదురైన సవాళ్లు, కష్టాల నుంచి, ఐపీఎల్ నుంచి అతను నేర్చుకున్నాడు. నేను కూడా అతని నుంచి నేర్చుకుంటాను. మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. బజ్‌బాల్‌లో కూడా నేర్చుకోవాల్సింది, మెరుగుపడాల్సింది ఇంకా ఉంది.’అని తెలిపాడు.
అసలేం జరిగిందంటే.. మూడో టెస్టులో జైశ్వాల్ శతకం పూర్తి చేసిన తర్వాత డక్కెట్ దాని గురించి మాట్లాడాడు. ‘ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లు తమలాగా ఆడుతుంటే మేం క్రెడిట్ తీసుకోవాల్సిందేనని అనిపిస్తుంది. ఇతర జట్లు కూడా దూకుడు క్రికెట్ ఆడటం ఉత్సాహంగా ఉంటుంది. అతనిలో సూపర్ స్టార్ కనిపిస్తున్నాడు. అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.’ అని డక్కెట్ వ్యాఖ్యానించాడు.
కాగా, భారత గడ్డపై బజ్‌బాల్ ఆటతో టీమ్ ఇండియాను బెంబేలెత్తించాలని చూసిన ఇంగ్లాండ్‌ను అదే బజ్‌బాల్ ఆటతో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ వణికిస్తున్నాడు. వరుసగా వైజాగ్, రాజ్‌కోట్ టెస్టుల్లో డబుల్ సెంచరీ బాదాడు. ప్రస్తుతం టెస్టు సిరీస్‌లో అతను 545 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.