'ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్ ప్యానెల్?'.. ఆ కంపెనీలకు సమాచారమిచ్చిన కేంద్రం

సినిమాలపై పర్యవేక్షణకు సెన్సార్ బోర్డు ఉన్నట్టే.. ఓటీటీ (ఓవర్ ది టాప్)

Update: 2023-07-14 15:12 GMT

న్యూఢిల్లీ : సినిమాలపై పర్యవేక్షణకు సెన్సార్ బోర్డు ఉన్నట్టే.. ఓటీటీ (ఓవర్ ది టాప్)లోని వీడియో కంటెంట్‌‌ను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ఒక స్వతంత్ర ప్యానెల్‌‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా హింస, పోర్న్, మత విద్వేషాలు వంటి అభ్యంతరకర అంశాలతో ఉండే ఓటీటీ కంటెంట్‌ను ఏరిపారేయాలని సర్కారు భావిస్తోంది. నెట్ ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్, యాపిల్ టీవీ, రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ యూనిట్ వయాకామ్ 18 సహా పలు ముఖ్యమైన ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు చెందిన ప్రతినిధులతో జూన్ 20న కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్వహించిన మీటింగ్‌లో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది.

అయితే ఓటీటీ కంటెంట్‌ను స్క్రీన్ చేసేందుకు స్వతంత్ర ప్యానెల్‌‌ను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై ఆయా కంపెనీలు అభ్యంతరం తెలపగా, తప్పకుండా ఆ దిశగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని కేంద్ర ఐటీ శాఖ వాటికి తేల్చి చెప్పింది. అంతర్జాతీయ కంటెంట్‌ సహా స్ట్రీమింగ్ కంటెంట్ ఎలా ఉండాలనే దానిపైనా నియమావళి ఉంటే బాగుంటుందని కేంద్రం పేర్కొంది. ఓటీటీలోని అశ్లీల, హింసాత్మక కంటెంట్‌పై ఫిర్యాదులు పెరుగుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించడానికి కట్టడి చర్యలు చేపట్టడం అవసరమని ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News