మానసిక లోపం, కడు పేదరికం.. విధిరాతకు ఎదురీది పారాలింపిక్స్‌లో సత్తాచాటిన తెలంగాణ బిడ్డ

పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో వరంగల్ అమ్మాయి జీవాంజి దీప్తి 400 మీటర్ల టీ20 రేసులో కాంస్యం సాధించింది.

Update: 2024-09-03 19:26 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆ అమ్మాయికి పరుగు తప్ప మరోటి తెలియదు. కానీ, మానసిక లోపం ఆమెకు శాపమైంది. చిన్నప్పటి నుంచే అవమానాలు ఎదుర్కొంది. మరోవైపు, కడు పేదరికం. రైతు కూలీలైన తల్లిదండ్రులు పని చేస్తే గానీ పూటగడవని నేపథ్యం. కానీ, ఇవేవీ ఆమె పరుగును ఆపలేకపోయాయి. ఆ అమ్మాయే జీవాంజి దీప్తి. అడుగడుగునా అవమానాలు, సమస్యలు, కష్టాలను అధిగమించిన దీప్తి అథ్లెటిక్స్‌లో అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. ఈ ఏడాది 400 మీటర్ల రేసులో వరల్డ్ చాంపియన్‌గా నిలవడమే కాకుండా పారాలింపిక్ పతక కలను సాకారం చేసుకుని మరో మెట్టెక్కింది మన పరుగుల రాణి.. దీప్తి.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి నిరుపేద కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు రైతు కూలీలు. తండ్రి యాదగిరి, తల్లి ధనలక్ష్మి. కూలి పనిచేస్తే గానీ ఇళ్లు గడవని పరిస్థితి. దానికితోడు కుమార్తె‌కు మానసిక ఎదుగుదల సమస్యతో వారు మరింత కుంగిపోయేవారు. మానసిక లోపంతో చిన్నప్పటి నుంచి దీప్తి అవమానాలే ఎదుర్కొంది. అయితే, ఆమెకు తెలిసిదొక్కటే పరుగు. పాఠశాలలో పరుగు పందెంలో రాణిస్తున్న ఆమెను స్కూల్ పీఈటీ ప్రోత్సహించాడు. దీప్తి ఆమె సమస్యను అధిగమించి జిల్లా స్థాయిలో రాణించింది.

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ మీట్‌లో ఆమె స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ రమేశ్ దృష్టిలో పడటంతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ ఆమెకు ఆర్థిక సహకారం అందించాడు. కోచ్ రమేశ్ శిక్షణలో పారా అథ్లెట్‌గా రాటుదేలిన దీప్తి అంతర్జాతీయ వేదికపై సత్తాచాటుతోంది. 2019లో జరిగిన ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో ఆమె కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాతి ఏడాది ఖేలో ఇండియా గేమ్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల రేసుల్లో స్వర్ణ పతకాలు సాధించింది. గతేడాది ఆసియా క్రీడల్లో ఆమె సంచలనమే చేసింది. 400 మీటర్ల రేసులో ఆసియా రికార్డు(55.07 సెకన్లు)తో బంగారు పతకం సాధించింది. ఇక, ఈ ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించింది. పారిస్‌లోనూ అదే జోరుతో దీప్తి పతక ప్రదర్శన చేసింది. 

Tags:    

Similar News