టీమ్ ఇండియా హెడ్ కోచ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన రికీ పాంటింగ్

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌ పదవి కోసం తనను సంప్రదించారని, అందుకు తాను నిరాకరించినట్టు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ తెలిపాడు.

Update: 2024-05-23 16:02 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్‌ పదవి కోసం తనను సంప్రదించారని, అందుకు తాను నిరాకరించినట్టు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. తాజాగా ఐసీసీతో పాంటింగ్ మాట్లాడుతూ భారత హెడ్ కోచ్ పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు ఆసక్తి ఉందా?లేదా? అనేది తెలుసుకోవడానికి ఐపీఎల్ సమయంలో చర్చలు జరిగాయి. జాతీయ జట్టుకు సీనియర్ కోచ్‌గా ఉండటం నాకు ఇష్టమే. కానీ, కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నా. టీమ్ ఇండియా హెచ్ కోచ్‌గా ఉంటే ఐపీఎల్‌తో సంబంధం ఉండకూడదు. 10 నుంచి 11 నెలలు విధుల్లోనే ఉండాలి. హెడ్ కోచ్ పదవి ప్రస్తుతం నా లైఫ్ స్టైల్‌కు ఇప్పుడు సరిపోదు.’ అని తెలిపాడు.

తన కుటుంబ సభ్యులు భారత్‌లో క్రికెట్ సంస్కృతిని చాలా ఇష్టపడతారని చెప్పాడు. ‘ఐపీఎల్ సమయంలో గత ఐదు వారాలు నా కుటుంబం, పిల్లలు నాతోనే ఉన్నారు. ప్రతి ఏడాది వాళ్లు వస్తారు. దీని గురించి నా కొడుకుతో మాట్లాడాను. ‘భారత జట్టుకు కోచ్‌గా పనిచేసే అవకాశం వస్తే వదులుకోవద్దు నాన్న. రెండేళ్లు అక్కడే ఉందాం’ అని నాకు చెప్పాడు. కానీ, ప్రస్తుత నా లైఫ్ స్టైల్ అందుకు సరిపోదు.’ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాగా, టీ20 వరల్డ్ కప్‌తో టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. దీంతో బీసీసీఐ కొత్త కోచ్‌ను వెతికే పనిలో పడింది. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27 చివరి తేదీ. ఈ నేపథ్యంలోనే పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

Tags:    

Similar News