దిశ, స్పోర్ట్స్ : లక్నోలో జరుగుతున్న సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు జోరు కొనసాగుతోంది. ఉమెన్స్ సింగిల్స్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 21-15, 21-17 తేడాతో చైనాకు చెందిన డాయి వాంగ్‌పై నెగ్గింది. 48 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో సింధు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండు గేముల్లోనూ ఆరంభంలో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత దూకుడుతో వరుసగా రెండు గేములను దక్కించుకుంది. ఈ ఏడాది సింధు సెమీస్‌కు చేరుకోవడం ఇది రెండోసారి.అలాగే, యువ షట్లర్ ఉన్నతి హుడా కూడా సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో ఆమె 21-16, 21-9 తేడాతో ఇషికా జైశ్వాల్(అమెరికా)పై నెగ్గింది. సెమీస్‌లో సింధుతో ఉన్నతి తలపడనుంది.
మరోవైపు, మెన్స్ సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ కూడా టైటిల్ దిశగా కీలక అడుగు వేశాడు. క్వార్టర్స్‌లో సహచర ఆటగాడు మీరాబా లువాంగ్ మైస్నమ్‌ను 8-21, 19-21 తేడాతో ఓడించి సెమీస్‌కు చేరుకున్నాడు. అలాగే, ఉమెన్స్ డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడీ క్వార్టర్స్‌లో 21-8, 21-15 తేడాతో గో పెయ్ కీ-టియోహ్ మెయి జింగ్(మలేషియా) జంటను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. పురుషుల డబుల్స్‌లో ఇషాన్- శంకర్ ప్రసాద్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జంటలు టాప్-4లో నిలిచాయి. ఉమెన్స్ సింగిల్స్ తస్నిమ్ మిర్, శ్రేయాన్షి, మెన్స్ సింగిల్స్‌లో ఆయుశ్ శెట్టి, రిత్విక్ క్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యారు.