త్వరలోనే నా ఆటతో అందరినీ సంతోషపరుస్తా : రిషభ్ పంత్

త్వరలోనే తన ఆటతో అందరినీ సంతోషపరుస్తానని, రోడ్డు ప్రమాదంతో జీవితం విలువ ఏంటో తెలిసిందని, చిన్న పనులను కూడా ఆస్వాదిస్తున్నానని టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అన్నాడు.

Update: 2023-02-28 16:36 GMT

దిశ, వెబ్ డెస్క్: త్వరలోనే నా ఆటతో అందరినీ సంతోషపరుస్తానని, రోడ్డు ప్రమాదంతో జీవితం విలువ ఏంటో తెలిసిందని, చిన్న పనులను కూడా ఆస్వాదిస్తున్నానని టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. పళ్లు తోముకోవడం దగ్గర నుంచి సూర్యుని కింద కూర్చోవడం వంటి రోజు వారి పనులు చేయాడాన్ని కూడా సంతోషంగా ఫీలవుతున్నానని తెలిపాడు. ఊహించని రోడ్డు ప్రమాదంతో ఇంటికే పరిమితమైన రిషభ్ పంత్..మెల్లిగా గాయాల నుంచి కోలుకుంటున్నాడు.

డిసెంబర్ 30న రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ఓ బస్సు, కండక్టర్ సాయంతో ప్రాణాలతో బయటపడిన పంత్.. తీవ్ర గాయాలతో ఆటకు దూరమయ్యాడు. మొకాలితో పాటు పంత్ ముఖానికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ మెడికల్ టీం పర్యవేక్షణలో పంత్ కోలుకుంటున్నాడు. ఇటీవలే ఊత కర్ర సాయంతో నడక మొదలు పెట్టిన స్టార్ బ్యాటర్ తాజాగా ప్రముఖ వార్త సంస్థతో మాట్లాడాడు. తన రికవరీ ప్రాసెస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

నా పద్ధతి పూర్తిగా మారింది..

ప్రస్తుతం తన పరిస్థితి మెరుగ్గా ఉందని, చాలా వేగంగా కోలుకుంటున్నానని రిషభ్ అన్నాడు. దేవుడీ దయతో పాటు మెడికల్ టీం సహకారంతో అతి త్వరలోనే నేను పూర్తిగా కోలుకుంటానని తెలిపాడు. ప్రస్తుతం తన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి చెప్పడం తనకు కష్టంగా ఉందన్నారు. అయితే, రోడ్డు ప్రమాదం తర్వాత నా జీవిన పద్ధతిలో పూర్తిగా మార్పు వచ్చిందన్నారు. చిన్న చిన్న పనులను కూడా ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. ఉరకుల పరుగుల జీవితంలో చాలామంది ఈ చిన్న చిన్న విషయాలను ఆస్వాదించలేకపోతున్నారని పేర్కొన్నాడు.

రోడ్డు ప్రమాదం తర్వాత తాను చేసే ప్రతీ పనిలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాని తెలిపాడు. చివరకు బ్రష్ చేయడం, సూర్యని కింద కూర్చోవడం వంటి పనులను ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నాడు. కానీ, రోడ్డు ప్రమాదం తర్వాత జీవితంలో ప్రతిరోజూ గొప్పదనే విషయం తనకు తెలిసొచ్చిందన్నాడు. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నట్లు, అది పాజిటీవ్ అయినా నెగటీవ్ అయినా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి డిసైడ్ అయ్యానన్నాడు షెడ్యూల్ ప్రకారం నా రోజు వారి పనులను ఫాలో అవుతున్నానని తెలిపాడు.

రోజంతా.. ఫిజియోథెరపి

ఉదయం లేవగానే ఫిజియోథెరపిస్ట్ సాయంతో తొలి ఫిజియోథెరపి సెషన్‌లో పాల్గొంటున్నానని రిషభ్ తెలిపాడు. కాస్త విరామం తీసుకొని రిఫ్రెష్ అయ్యి సెకండ్ సెషన్‌కు సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. సెకండ్ సెషన్ త్వరగా ప్రారంభించి ఎంత నొప్పిని భరించగలుగుతున్నాననే విషయాన్ని గ్రహిస్తున్నానన్నడు. మెడికల్ టీం సూచనల మేరకు పండ్లు, పానియాలు తీసుకుంటున్నట్లు తెలిపాడు.

ప్రియమైన అభిమానులు..

తాను కోలుకోవాలని చాలా మంది మెసేజ్‌లు చేశారని, ఇంత మంది శ్రేయోభిలాషులు తన వెంట ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. భారత జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్‌కు మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పంత్ తెలిపాడు. మీ ప్రేమను ఇలానే పంపిస్తూనే ఉండండంటూ.. అందుకు తర్వలోనే తన ఆటతో అందరినీ సంతోషపరుస్తానని పంత్ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News