షెఫాలీపై వేటు.. హర్లీన్ రీఎంట్రీ.. ఆసిస్ పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు ఖరారు

వచ్చే నెలలో భారత మహిళల క్రికెట్ జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.

Update: 2024-11-19 12:15 GMT

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో భారత మహిళల క్రికెట్ జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ టూరుకు బీసీసీఐ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును మంగళవారం ఎంపిక చేసింది. వన్డే జట్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఫామ్ లేమితో సతమతమవుతున్న ఓపెనర్ షెఫాలీ వర్మ జట్టులో చోటు కోల్పోయింది. ఆమె 2022 జూలైలో చివరి హాఫ్ సెంచరీ చేసింది. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఆమె కేవలం 56 పరుగులే చేసింది.

ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా సెలెక్షన్‌కు దూరంగా ఉంది. ఆల్‌రౌండర్ మిన్ను మణి తొలిసారి వన్డే జట్టు నుంచి పిలుపు అందుకుంది. గతేడాది టీ20ల్లో అరంగేట్రం చేసిన ఆమె ఇటీవల ఆసిస్ పర్యటనలో భారత్ ‘ఏ’ తరపున ఆకట్టుకుంది. వికెట్ కీపర్ రిచా ఘోష్, ఆల్‌రౌండర్ హర్లీన్ డియోల్ తిరిగి జట్టులోకి వచ్చారు. గ్రేడ్ 12 బోర్డ్ ఎగ్జామ్స్ కారణంగా కివీస్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న రిచా ఘోష్ ఆసిస్ పర్యటనకు అందుబాటులోకి వచ్చింది.

అలాగే ఏడాది తర్వాత హర్లీన్ జాతీయ జట్టులో పునరాగమనం చేయబోతున్నది. గతేడాది డిసెంబర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన హర్లీన్.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌(డబ్ల్యూపీఎల్)లో గాయపడి జట్టుకు దూరమైంది. ప్రియ పూనియా కూడా తిరిగి జట్టులో స్థానం సంపాదించింది. కివీస్‌తో సిరీస్‌లో పాల్గొన్నహేమలత, ఉమా ఛెత్రి, సయాలీ సత్‌గారే‌లకు జట్టులో చోటు దక్కలేదు. న్యూజిలాండ్‌‌తో తొలి వన్డేలో 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన తేజాల్ హసబ్నిస్‌ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. గత నెలలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ సాధించిన హర్మన్‌ప్రీత్ సేన ఆసిస్ గడ్డపై కూడా అదే జోరు కొనసాగించాలనుకుంటున్నది. డిసెంబర్ 5న బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరగనుంది. డిసెంబర్ 8, 11 తేదీల్లో మిగతా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత మహిళల క్రికెట్ జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, ప్రియా పూనియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, యాస్తికా భాటియా, రిచా ఘోష్, తేజాల్ హసబ్నిస్, దీప్తి వర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, సైమా ఠాకూర్.

Tags:    

Similar News