దేశవాళీపై ఫోకస్ పెట్టిన భారత క్రికెటర్లు.. ఆ టోర్నీలో బరిలో స్టార్ ప్లేయర్లు
భారత క్రికెటర్లు దేశవాళీ క్రికెట్‌పై ఫోకస్ పెట్టబోతున్నారు.
దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెటర్లు దేశవాళీ క్రికెట్‌పై ఫోకస్ పెట్టబోతున్నారు. ఇటీవల శ్రీలంక పర్యటనను ముగించిన భారత జట్టుకు.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ వరకు మధ్యలో ఎలాంటి మ్యాచ్‌లు లేవు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 1 వరకు బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. దాదాపు నెలకుపైగా ఆటగాళ్లకు సమయం ఉన్నది. ఆలోగా దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. జాతీయ జట్టు బాధ్యతలు లేని సమయాల్లో దేశవాళీ ఆడాలని గతంలో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. స్టార్ క్రికెటర్లు కూడా దేశవాళీ ఆడబోతున్నారు.
వచ్చే నెల 5 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీకి భారత ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారు. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజాతోసహా ఇతర క్రికెటర్లు కూడా ఈ టోర్నీలో భాగం కానున్నట్టు తెలుస్తోంది. ఈ టోర్నీ ఆడటం వల్ల బంగ్లాతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందనేది బీసీసీఐ భావిస్తున్నది. 2022లో కారు ప్రమాదం తర్వాత పంత్ ఆడబోతున్న తొలి రెడ్ బాల్ టోర్నీ ఇదే. అలాగే, వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయపడి సర్జరీ చేయించుకున్న షమీ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. అతను బంగ్లా సిరీస్ నాటికి అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉంది. మ్యాచ్ ఫిట్‌నెస్ కోసం అతను కూడా దులీప్ ట్రోఫీ ఆడే అవకాశం ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషన్ కూడా తిరిగి దేశవాళీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దులీప్ ట్రోఫీ కంటే ముందే సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడనున్నారు. ముంబై తరపున సూర్య, శ్రేయస్ ఈ నెల 27న జమ్మూ కశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నట్టు ముంబై క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. బుచ్చిబాబు టోర్నీలో జార్ఖండ్‌కు ఇషాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
వాళ్లకు మినహాయింపు?
కెప్టెన్ రోహిత్, స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలకు బీసీసీఐ మినహాయింపు ఇచ్చినట్టు తెలుస్తోంది. పని ఒత్తిడి మేనేజ్‌మెంట్‌లో భాగంగా వీరికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే, రోహిత్, కోహ్లీ ఆడాలా?వద్దా? అనేది వారికే వదిలేసినట్టు సమాచారం. ఇక, బుమ్రా విషయంలో సెలెక్టర్లు రిస్క్ తీసుకోవద్దనుకుంటున్నారు. బంగ్లాతో టెస్టు సిరీస్ కంటే ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కీలకమని సెలెక్టర్లు భావిస్తున్నారు. నవంబర్‌లో ఐదు టెస్టుల కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.