బెంగ తీరింది.. ఫామ్ అందుకున్న కేఎల్ రాహుల్, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్
కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌లపై ఎన్నో అనుమానాలు.
న్యూఢిల్లీ: కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌లపై ఎన్నో అనుమానాలు.. రాహుల్, అయ్యర్ గాయం నుంచి కోలుకుని వచ్చినప్పటికీ వారి ప్రదర్శనపై ఎన్నో సందేహాలు.. వన్డేల్లో విఫలమవుతున్న సూర్య ఫామ్‌పై ఆందోళన.. వీరిని ఆసియా కప్, ప్రపంచకప్‌కు ఎంపిక చేయడంపై ప్రశ్నలు.. విమర్శలు.. ఈ భయాలన్నింటినీ ఈ ముగ్గురు పటాపంచలు చేశారు. ప్రపంచకప్‌కు ముందు తాము సిద్ధమే అని నిరూపించుకున్నారు.
గాయాన్ని దాటి..
ఆసియా కప్, ప్రపంచకప్ ముందు టీమ్ ఇండియాను గాయాలు వేధించాయి. వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగానే జట్టుకు దూరమయ్యారు. కీలకమైన ఈ ముగ్గురు దూరమవడంతో జట్టు మిడిలార్డర్ బలహీనపడింది. అయితే, రాహుల్, అయ్యర్‌లు ప్రపంచకప్ నాటికి అందుబాటులో ఉంటారని టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకంగానే ఉన్నా.. యువ క్రికెటర్లను సిద్ధంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేసింది.
ఆసియా కప్‌కు ముందు వీరిద్దరు కోలుకుని జట్టుకు అందుబాటులోకి వచ్చారు. అయితే, ఆసియా కప్‌కు ముందు ఎలాంటి మ్యాచ్ ఆడకుండానే వీరిని నేరుగా టోర్నీకి ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. గాయం కంటే ముందు అయ్యర్ ఈ ఏడాది కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే బరిలోకి దిగాడు. గతేడాది అయ్యర్ వన్డేల్లో 17 మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఆరు హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ బాదాడు. రాహుల్ గాయం కంటే ముందు చివరి 10 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. అందులో మూడు అర్ధ సెంచరీలు చేశాడు. ఈ నేపథ్యంలో వీరిపై టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకం పెట్టుకుంది.
జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆసియా కప్‌లో రాహుల్ రాణించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు. అలాగే, ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో వరుసగా హాఫ్ సెంచరీలు (58, 52) చేసి.. తాను ప్రపంచకప్ సిద్ధమే అని ప్రకటించాడు. మరోవైపు, శ్రేయస్ అయ్యర్ పరిస్థితి వేరు. ఆసియా కప్‌లో పాక్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో 14 పరుగులు మాత్రమే చేశాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అనంతరం మళ్లీ గాయం తిరబెట్టడంతో టోర్నీకి దూరమయ్యాడు. దాంతో అతను ప్రపంచకప్ ఆడటంపై సందేహాలు తీవ్రమయ్యాయి.
అతని ఫిట్‌నెస్‌పై అనుమానాలు నెలకొన్న సమయంలో అతని స్థానంలో యువ బ్యాటర్ తిలక్ వర్మ ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని కూడా టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. ఈ క్రమంలోనే ఆసిస్‌తో వన్డే సిరీస్‌కు అయ్యర్‌తోపాటు తిలక్‌ను సెలెక్ట్ చేసింది. తొలి వన్డేలో అయ్యర్ 3 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. ఇక, అయ్యర్ ప్రపంచకప్ ఆడటం డౌటే అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ, రెండో వన్డేలో ఆసిస్ బౌలర్లను అయ్యర్ ఉతికారేసిన తీరు అద్భుతం. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దూకుడుగా ఆడిన అతను సెంచరీతో కదం తొక్కాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశాడు.
వన్డేల్లోనూ సూర్య ప్రతాపం మొదలు
ఆస్ట్రేలియాపై వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన సూర్యకుమార్ వన్డేల్లో ఫామ్ అందుకున్నాడు. ఈ సిరీస్‌కు ముందు గత 10 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. 35 పరుగులే అతను చేసిన అత్యధిక స్కోరు. మూడు సార్లు డకౌట్ కూడా అయ్యాడు. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లో 26 పరుగులే చేశాడు. దాంతో టీ20ల్లో నం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నప్పటికీ వన్డేల్లో మాత్రం విఫలమవుతుండటంపై అతనిపై విమర్శలు వెల్లువెత్తుతాయి. ప్రపంచకప్ జట్టులోనూ భాగం చేయడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు.
అయితే, కానీ, టీమ్ మేనేజ్‌మెంట్ అతని సామర్థ్యంపై నమ్మకం ఉంచింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. సూర్య మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్లేయర్‌ని చెప్పాడు. విమర్శలన్నింటికీ ఆస్ట్రేలియా సిరీస్‌తో తెరదించాడు సూర్యకుమార్. బ్యాక్ టూ బ్యాక్ హాఫ్ సెంచరీలు బాదాడు. రెండో వన్డేల్లో అతని మెరుపు ఇన్నింగ్స్ కచ్చితంగా చూసి తీరాల్సిందే. టీ20 తరహాలో చెలరేగాడు. ప్రపంచకప్‌కు ముందు కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ తిరిగి ఫామ్ అందుకోవడంతో టీమ్ ఇండియా బ్యాటింగ్ బలం పెరిగింది.