దిశ, స్పోర్ట్స్ : మైదానంలో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కవ్వించడానికి ప్రత్యర్థి ఆటగాళ్లు వెనకడుగువేస్తారు. ఎందుకంటే, అతన్ని స్లెడ్జ్ చేస్తే కౌంటర్ ఎలా ఉంటుందో వారికి తెలుసు. 2014-15 ఆస్ట్రేలియా పర్యటనను అభిమానులు అంత సులువుగా మర్చిపోలేరు. విరాట్ కోహ్లీ, ఆసిస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ మధ్య ఆసక్తికరపోరు జరిగింది. తాజాగా ఓ ఈవెంట్‌లో ఆ పర్యటనను గుర్తు చేసుకున్న కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ పర్యటనకు 60 రోజుల ముందు నుంచి అలా ఆడాలి.. ఇలా ఆడాలి అని సిద్ధమయ్యా. అయితే, తొలి టెస్టులో జాన్సన్ వేసిన తొలి బంతే నా తలకు తగిలింది. ఆ దెబ్బతో నా ప్లాన్స్ మారిపోయాయి. అది పెద్ద దెబ్బనే. నా ఎడమ కన్ను వాచింది. కంటిచూపు కాస్త మందగించడం ప్రారంభమైంది. కానీ, నేను అప్పుడు గమనించలేదు. లంచ్ సమయానికి నా ముందు రెండు ఆప్షన్లు మాత్మే ఉన్నాయి. ఫైట్ లేదా ఫ్లైట్. మొదటి దాన్నే ఎంచుకున్నా. నా తలపై కొట్టడానికి అతడికెంత ధైర్యం? అని అనుకున్నా. ఈ సిరీస్‌లో అతడిని వదిలిపెట్దొదని నిర్ణయించుకున్నా. అదే చేశాను.’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా, ఆ మ్యాచ్‌లో కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదాడు. అయితే, ఆ మ్యాచ్‌లో భారత్ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ సిరీస్ తర్వాత ధోనీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో విరాట్ పూర్తి స్థాయి కెప్టెన్సీ చేపట్టాడు.