IND VS AUS : మూడో రోజూ భారత్‌దే.. పెర్త్ టెస్టులో విజయం దిశగా టీమిండియా

ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తున్నది.

Update: 2024-11-24 11:21 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తున్నది. యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ సెంచరీలకు తోడు మూడో రోజే ఆసిస్ పతనం మొదలవడంతో భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. అద్భుతం జరిగితే తప్ప విజయం దాదాపు ఖాయమే. బుమ్రా ధాటికి ఆసిస్ మూడో రోజే మూడు వికెట్లు కోల్పోగా.. మరో 7 వికెట్లు తీస్తే మ్యాచ్ మనదే. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజూ భారత్‌దే. ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 170/0తో ఆట కొనసాగించిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 487/6 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. యశస్వి జైశ్వాల్(161, 297 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో రాణించగా.. కోహ్లీ(140 నాటౌట్, 143 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్స్‌లు) కదం తొక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం కలుపుకుని భారత్.. ఆసిస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఛేదనలోనూ కంగారుల జట్టు తడబడింది. మూడో రోజు ఆఖర్లో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. బుమ్రా మరోసారి వికెట్ల వేట మొదలుపెట్టాడు. రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. తొలి ఓవర్‌‌లోనే ఆసిస్‌కు షాకిచ్చిన అతను..ఓపెనర్ మెక్‌స్వీనీ(0)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే ప్రమోషన్‌పై ఫస్ట్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కమిన్స్(2)ను సిరాజ్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే బుమ్రా.. లబుషేన్(3)ను అవుట్ చేశాడు. ఆ బంతి తర్వాత అంపైర్లు మూడో రోజు ముగిసినట్టు ప్రకటించారు. ఆసిస్ చేతిలో ఇంకా 7 వికెట్లు ఉండగా.. ఆ జట్టు ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది.

బౌలర్లను ముప్పుతిప్పులు పెట్టారు

మూడో రోజు కూడా ఆసిస్ బౌలర్లను భారత బ్యాటర్లు ముప్పుతిప్పలు పెట్టారు. పంత్, ధ్రువ్ జురెల్ మినహా మిగతా వారందరూ ఆచితూచి ఆడి కంగారుల ఓపికను పరీక్షించారు. యశస్వి జైశ్వాల్(161) భారీ సెంచరీ నమోదు చేయగా.. కోహ్లీ(100 నాటౌట్) కూడా శతక్కొట్టడంతో టీమిండియా తిరుగులేని స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 172/0తో భారత్ ఆటను కొనసాగించగా.. జైశ్వాల్ ఆరంభంలోనే సెంచరీ పూర్తి చేశాడు. అయితే, కాసేపటికే ఓవర్‌నైట్ బ్యాటర్ కేఎల్ రాహుల్(77) వికెట్ కోల్పోవడంతో ఈ జోడీ విడిపోయింది. తొలి వికెట్‌కు ఈ జంట 201 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించింది. అనంతరం పడిక్కల్(25)సహకారంతో జైశ్వాల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆచితూచి ఆడుతూనే అడపాదడపా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలోనే 150 రన్స్ మార్క్‌ను అందుకుని ద్విశతకంపై కన్నేశాడు. అయితే, రెండో సెషన్‌లో ఆసిస్ బౌలర్లు పుంజుకున్నారు. 84 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశారు. పడిక్కల్, జైశ్వాల్ స్వల్ప వ్యవధిలోనే అవుటవ్వగా.. పంత్(1), ధ్రువ్ జురెల్(1) నిరాశపరిచారు. దీంతో భారత్ జోరుకు బ్రేక్‌లు పడినట్టే అనిపించింది. కానీ, ఆ తర్వాత ఆసిస్ జట్టుపై కోహ్లీ పిడుగు పడింది. సుందర్(29) స్ట్రైక్‌రొటేట్ చేస్తుంటే కోహ్లీ ఆసిస్ బౌలర్లను పరుగులు పెట్టించాడు.చాలా కాలం తర్వాత విరాట్ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక, సుందర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి(38 నాటౌట్) మరోసారి ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు, హాఫ్ సెంచరీ తర్వాత విరాట్ దూకుడు పెంచాడు. వీరిద్దరూ బౌండరీలతో చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే లుబుషేన్ వేసిన 134 ఓవర్‌లో విరాట్ ఫోర్ కొట్టి 81వ సెంచరీ నమోదు చేశాడు. అదే బంతికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 487/6 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది.

స్కోరుబోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్ : 150 ఆలౌట్

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 104 ఆలౌట్

భారత్ రెండో ఇన్నింగ్స్ : 487/6 డిక్లేర్డ్(134.3 ఓవర్లు)

యశస్వి జైశ్వాల్(సి)స్మిత్(బి)మార్ష్ 161, రాహుల్(సి)అలెక్స్ కేరీ(బి)స్టార్క్ 77, పడిక్కల్(సి)స్మిత్(బి)హాజెల్‌వుడ్ 25,కోహ్లీ 100 నాటౌట్, పంత్(స్టంప్)అలెక్స్ కేరీ(బి)లియోన్ 1, ధ్రువ్ జురెల్ ఎల్బీడబ్ల్యూ(బి)కమిన్స్ 1, వాషింగ్టన్ సుందర(బి)లియోన్ 29, నితీశ్ రెడ్డి 38 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 55.

వికెట్ల పతనం : 201-1, 275-2, 313-3, 320-4, 321-5, 410-6

బౌలింగ్ : స్టార్క్(26-2-111-1), హాజెల్‌‌వుడ్(21-9-28-1), కమిన్స్(25-5-86-1), మార్ష(12-0-65-1), లియోన్(39-5-96-2), లబుషేన్(6.3-0-38-0), హెడ్(5-0-26-0)

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 12/3(4.2 ఓవర్లు)

మెక్‌స్వీనీ ఎల్బీడబ్ల్యూ(బి)బుమ్రా 0, ఉస్మాన్ ఖవాజా 3 బ్యాటింగ్, కమిన్స్(సి)కోహ్లీ(బి)సిరాజ్ 2, లబుషేన్ ఎల్బీడబ్ల్యూ(బి)బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 4.

వికెట్ల పతనం : 0-1, 9-2, 12-3

బౌలింగ్ : బుమ్రా(2.2-1-1-2),సిరాజ్(2-0-7-1)

Tags:    

Similar News