దిశ, వెబ్‌డెస్క్: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన భారత మహిళల జట్టు ఇక చివరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని చూస్తున్నది. తొలి మ్యాచ్‌లో కంగారూలకు పోటీనివ్వలేకపోయిన హర్మన్‌ప్రీత్ బృందం.. రెండో వన్డేలో విజయానికి చేరువగా వచ్చి విఫలమైంది. రిచ ఘోష్, జెమీమా రోడ్రిగ్స్ రాణించినా.. కీలక సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో పరాజయం తప్పలేదు. ఇప్పుడు ఆ లోపాలను సరిదిద్దుకొని సమిష్టిగా సత్తాచాటాలని కోరుకుంటున్నది.
మరోవైపు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధన, యస్తిక భాటియా, జెమీమా, రిచా, హర్మన్, దీప్తి శర్మ, పూజ వస్ర్తాకర్ సమిష్టిగా సత్తాచాటాల్సిన అవసరం ఉంది. ఇక టెస్టు ఫార్మాట్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను వణికించిన మన బౌలర్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆ స్థాయి ప్రభావం చూపలేకపోతున్నారు. ఫీల్డింగ్ కూడా మెరుగుపడాల్సి ఉంది.