IND vs SL : బోణీ కొట్టిన భారత్.. తొలి టీ20లో శ్రీలంక చిత్తు
శ్రీలంక పర్యటనలో టీమ్ ఇండియా శుభారంభం చేసింది.
దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక పర్యటనలో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. తొలి టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన భారత జట్టు టీ20 సిరీస్‌ను ఘనంగా మొదలుపెట్టింది. శనివారం పల్లెకెల్ వేదికగా జరిగిన తొలి టీ20లో శ్రీలంకను 43 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 213/7 స్కోరు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్(58) కెప్టెన్సీకి ఇన్నింగ్స్‌కుతోడు పంత్(49), జైశ్వాల్(40), గిల్(34) సత్తాచాటారు. అనంతరం ఛేదనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 స్కోరుకే ఆలౌటైంది. ఓపెనర్లు నిశాంక(79), కుసాల్ మెండిస్(45)అందించిన శుభారంభాన్ని మిగతా బ్యాటర్లు కొనసాగించలేకపోయారు.
చెలరేగిన బౌలర్లు
బ్యాటర్లు భారీ స్కోరు అందిస్తే.. బౌలర్లు తమ పాత్ర నిర్వర్తించారు. భారత బౌలింగ్‌లో విలవిలలాడిన లంక జట్టు 19.2 ఓవర్లలో ఆలౌటైంది. అయితే, శ్రీలంక జట్టుకు దక్కిన ఆరంభం మాత్రం భారత జట్టును ఆందోళన పెట్టిందనడంలో సందేహం లేదు. ఓపెనర్లు నిశాంక(79), కుసాల్ మెండిస్(45) జట్టుకు మెరుపు ఆరంభం అందించారు. తొలి వికెట్‌కు వీరు 84 పరుగులు జోడించారు. మెండిస్ అవుటైనా క్రీజులో పాతుకపోయిన నిశాంక జట్టును పోటీలో ఉంచాడు. ఒక దశలో 14 ఓవర్లలో శ్రీలంక 140/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఆలస్యంగా పుంజుకున్న భారత బౌలర్లు ఆ తర్వాత లంక జట్టును బెంబేలెత్తించారు. అక్షర్ 15వ ఓవర్‌లో నిశాంక దూకుడుకు బ్రేక్ వేయడంతోపాటు కుసాల్ పెరీరా(20)ను అవుట్ చేయడంతో ఆ జట్టు పతనం మొదలైంది. ఆ తర్వాత కెప్టెన్ అసలంక(0), షనక(0), హసరంగ(2) నిరాశపర్చడంతో ప్రత్యర్థి ఓటమి ఖాయమైంది. ఆఖరి ఓవర్ వేసిన రియాన్ పరాగ్ ఆ ఓవర్‌లో, తీక్షణ(2), మధుశంక(0)లను అవుట్ చేయడంతో శ్రీలంక ఆట ముగిసింది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లు, అర్ష్‌దీప్, అక్షర్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్, రవి బిష్ణోయ్‌లకు చెరో వికెట్ దక్కింది.
లంక బౌలర్లను చితక్కొట్టారు
అంతకుముందు భారత టాపార్డర్ బ్యాటర్లు శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్ ఈ దూకుడుకు శ్రీకారం చుట్టారు. వీరు ఎడాపెడా బౌండరీలు బాదడంతో జట్టుకు అదిరిపోయే ఆరంభం దక్కింది. పవర్ ప్లేలో వీరు ఏ బౌలర్‌ను వదలకుండా చితక్కొట్టడంతో 5.5 ఓవర్లలోనే భారత్ 74/0 స్కోరుతో నిలిచింది. అయితే, స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ అవుటయ్యారు. 6వ ఓవర్‌లో ఆఖరి బంతికి గిల్(34) క్యాచ్ అవుటవ్వగా.. ఆ తర్వాతి ఓవర్‌లో తొలి బంతికే జైశ్వాల్(40) వెనుదిరిగాడు. జైశ్వాల్, గిల్‌లను అవుట్ చేసిన ఆనందం శ్రీలంకకు ఎంతో సేపు లేదు. కెప్టెన్ సూర్యకుమార్ బౌలర్లపై పిడుగల్లే పడ్డాడు. అతనికి పంత్ సహకరించాడు. మధుశంక బౌలింగ్‌లో వరుసగా 6, 4,4 కొట్టి ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టిన సూర్య క్రీజులో ఉన్నంత సేపు బాదేశాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే అతను తన 20వ టీ20 హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. సూర్య బాదుడుతో భారత్ 13.1 ఓవర్లలోనే 150 పరుగులతో నిలిచి భారీ స్కోరుపై కన్నేసింది. ఆ తర్వాత కాసేపటికే సూర్య(58) వెనుదిరగగా.. అప్పటివరకు నిదానంగా ఆడిన పంత్ గేర్ మార్చాడు. మరోవైపు, పతిరణ వరుస వికెట్లతో భారత్‌ను దెబ్బకొట్టాడు. పాండ్యా(9), రియాన్ పరాగ్(7), రింకు సింగ్(1) నిరాశపర్చగా.. మరో ఎండ్‌లో పంత్ మాత్రం బౌండరీలు కొట్టాడు. హాఫ్ సెంచరీకి చేరువైన పంత్(49) కూడా పతిరణ బౌలింగ్‌లోనే అవుటవ్వగా.. అప్పటికే స్కోరు 200 దాటింది. శ్రీలంక బౌలర్లలో పతిరణ 4 వికెట్లతో సత్తాచాటగా.. హసరంగ, మధుశంకలకు చెరో వికెట్ దక్కింది.
స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్ : 213/7(20 ఓవర్లు)
జైశ్వాల్(స్టంప్)కుసాల్ మెండిస్ (బి)హసరంగ 40, గిల్(సి)ఫెర్నాండో(బి)మధుశంక 34, సూర్యకుమార్ ఎల్బీడబ్ల్యూ(బి)పతిరణ 58, పంత్(బి)పతిరణ 49, పాండ్యా(బి)పతిరణ 9, రియాన్ పరాగ్ ఎల్బీడబ్ల్యూ(బి)పతిరణ 7, రింకు సింగ్(బి)ఫెర్నాండో 1, అక్షర్ 10 నాటౌట్, అర్ష్‌దీప్ 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 4.
వికెట్ల పతనం : 74-1, 74-2, 150-3, 176-4, 192-5, 201-6, 206-7
బౌలింగ్ : మధుశంక(3-0-45-1), అసిత ఫెర్నాండో(4-0-47-1), తీక్షణ(4-0-44-0), హసరంగ(4-0-28-1), కామిందు మెండిస్(1-0-9-0), పతిరణ(4-0-40-4)
శ్రీలంక ఇన్నింగ్స్ : 170 ఆలౌట్(19.2 ఓవర్లు)
నిశాంక(బి)అక్షర్ 79, కుసాల్ మెండిస్(సి)జైశ్వాల్(బి)అర్ష్‌దీప్ 45, కుసాల్ పెరీరా(సి)రవి బిష్ణోయ్(బి)అక్షర్ 20, కామిందు మెండిస్(బి)రియాన్ పరాగ్ 12, అసలంక(సి)జైశ్వాల్(బి)రవి బిష్ణోయ్ 0, షనక రనౌట్(సిరాజ్/పంత్) 0, హసరంగ(సి)రియాన్ పరాగ్(బి)అర్ష్‌దీప్ 2, తీక్షణ(బి)రియాన్ పరాగ్ 2, పతిరణ(సి)అక్షర్(బి)సిరాజ్ 6, ఫెర్నాండో 0 నాటౌట్, మధుశంక(బి)రియాన్ పరాగ్ 0; ఎక్స్‌ట్రాలు 4.
వికెట్ల పతనం : 84-1, 140-2, 149-3, 158-4, 160-5, 161-6, 163-7, 170-8, 170-9, 170-10
బౌలింగ్ : అర్ష్‌దీప్(3-0-24-2), సిరాజ్(3-0-23-1), అక్షర్(4-0-38-2), రవి బిష్ణోయ్(4-0-37-1), పాండ్యా(4-0-41-0), రియాన్ పరాగ్(1.2-0-5-3)