దిశ, వెబ్‌డెస్క్: సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న భారత్‌కు మరో ఎదురదెబ్బ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా భారత జట్టుకు 10 శాతం జరిమానా (మ్యాచ్ ఫీజ్‌లో) విధించబడింది. అలాగే రెండు ముఖ్యమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లను సైతం టీమిండియా కోల్పోయింది. కనీస ఓవర్ రేట్‌ను మెయింటైన్ చేయడంలో విఫలం కావడంతో టీమిండియాపై ఈ చర్యలు తీసుకున్నట్టు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ చర్యల ప్రభావం టీమిండియా డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌పై భారీ ప్రభావం చూపింది.
పెనాల్టీకి ముందు భారత్ 16 పాయింట్లు, 44.44 పాయింట్ల శాతంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. తాజాగా భారత్ ర్యాంక్ ఆరో స్థానానికి (38.89) పడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు 66.67 పాయింట్ల శాతంతో తొలిస్దానంలో ఉండిన టీమిండియా ఒక్కసారిగా భారీగా పాయింట్లు కోల్పోయి ఆరో స్థానానికి దిగజారింది. మరోవైపు భారత్‌పై అద్బుత విజయం సాధించిన సౌతాఫ్రికా 100 పాయింట్ల శాతంతో (12 పాయింట్లు) డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకోగా.. రెండో టెస్ట్‌లోనూ పాక్‌ను మట్టికరిపించడంతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ (50.00) రెండో స్థానంలో.. బంగ్లాదేశ్ (50), పాకిస్తాన్ (45.83) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.