అరుదైన ఘనతకు వేదిక కాబోతున్న ఐదో టెస్టు.. వాళ్లద్దరికి మరింత ప్రత్యేకం

ఈ నెల 7 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభమయ్యే ఐదో టెస్టు నామమాత్రమే కానుంది.

Update: 2024-03-03 17:33 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమ్ ఇండియా 3-1తో ఇప్పటికే దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 7 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభమయ్యే్ ఐదో టెస్టు నామమాత్రమే కానుంది. అయితే, ఈ ఐదో టెస్టు ఇద్దరు ఆటగాళ్లకు మాత్రం స్పెషల్‌గా నిలువనుంది. వాళ్లెవరో కాదు టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్టో. ధర్మశాల మ్యాచ్‌తో వీరిద్దరూ తమ కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నారు.

147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో..

100వ టెస్టు కచ్చితంగా ప్రత్యేకమైనదే. వరల్డ్ క్రికెట్‌లో ఇప్పటివరకు కొందరే ఈ మైలురాయిని అందుకున్నారు. ఐదో టెస్టుతో ఈ ఘనత సాధించిన 14వ భారత క్రికెటర్‌గా అశ్విన్.. 17వ ఇంగ్లాండ్ ప్లేయర్‌గా బెయిర్‌ స్టో నిలువనున్నారు. ఇప్పటివరకు వరల్డ్ క్రికెట్‌లో 76 మంది 100 టెస్టులు పూర్తి చేశారు. ఐదో టెస్టులో అశ్విన్, బెయిర్‌ స్టో అరుదైన ఘనత సాధించనున్నారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లు 100వ టెస్టు ఆడటం ఇది మూడోసారి మాత్రమే కానుంది. గతంలో 2006లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరపున షాన్ పొలాక్, కివీస్ తరపున స్టీఫెన్ ఫ్లెమింగ్ తొలిసారిగా 100వ టెస్టు ఆడారు. ఆ తర్వాత 2013-14 యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ రెండోసారి ఈ మైలురాయిని అందుకున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన అలిస్టర్ కుక్, ఆసిస్‌ తరపున మైఖేల్ క్లార్క్ 100వ టెస్టు బరిలో దిగారు. 10 ఏళ్ల తర్వాత అశ్విన్, బెయిర్ స్టో ఈ ఘనత అందుకోనున్నారు. 

Tags:    

Similar News