ICC Champions Trophy 2025 : కొనసాగుతున్న ఉత్కంఠ.. ఐసీసీ కీలక భేటీ వాయిదా
చాంపియన్స్ ట్రోఫీ-2025 భవితవ్యాన్ని తేల్చే ఐసీసీ కీలక భేటీ ఎలాంటి నిర్ణయం వెలువడకముందే వాయిదా పడింది.
దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీ-2025 భవితవ్యాన్ని తేల్చే ఐసీసీ కీలక భేటీ ఎలాంటి నిర్ణయం వెలువడకముందే వాయిదా పడింది. శుక్రవారం 20 నిమిషాల పాటు బోర్డు మెంబర్లు చర్చించి మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. బోర్డుకు చెందిన 12 మంది మెంబర్లు, అసోసియేటెడ్ దేశాలకు చెందిన ముగ్గురు డైరెక్టర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే రానున్న 24 గంటల్లోనే ఐసీసీ మరోసారి భేటీ కానున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అంశంలో నెలకొన్న స్తబ్ధతను తొలగించేందుకు ఐసీసీ ప్రతినిధులు కీలక తీర్మానం చేయనున్నట్లు తెలిసింది. ఒక వేళ నేడు(శనివారం) ఈ భేటీ జరగని పక్షంలో రెండు, మూడు రోజుల్లు మీటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ తమ జట్టును పాకిస్తాన్‌కు పంపేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. మరో వైపు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించేది లేదని పీసీబీ భీష్మించుకు కూర్చుంది. దీంతో ట్రోఫీ నిర్వహణ ఐసీసీకి సవాల్‌గా మారిన విషయం తెలిసిందే.