టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్ అఫీషియల్స్‌లో ముగ్గురు భారతీయులు

వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్‌కు సమయం దగ్గరపడుతున్నది.

Update: 2024-05-03 13:33 GMT

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్‌కు సమయం దగ్గరపడుతున్నది. ఈ నేపథ్యంలో ఐసీసీ శుక్రవారం ఈ మెగా టోర్నీలో తొలి రౌండ్‌కు మ్యాచ్ అఫీషియల్స్‌ను ప్రకటించింది. 20 మంది అంపైర్లు, ఆరుగురు మ్యాచ్ రిఫరీలతో మొత్తం 26 మంది అఫీషియల్స్‌ను నియమించింది. ఇందులో ముగ్గురు భారతీయులకు చోటు దక్కింది. అంపైర్లు‌గా నితిన్ మీనన్, జయరామన్ మదనగోపాల్, మ్యాచ్ రిఫరీగా జవగల్ శ్రీనాథ్ ఎంపికయ్యారు.

అంపైర్ల జాబితాలో గతేడాది ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ పొందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌తోపాటు 2022 టీ20 వరల్డ్​కప్​ఫైనల్‌లో అంపైర్లుగా వ్యవహరించిన కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్ ఉన్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన రిచార్డ్‌ కెటిల్‌బరో కూడా ఈ లిస్ట్‌లో ఉండటం భారత అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అతను అంపైర్‌గా వ్యవహరించిన నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా ఓడిపోవడమే అందుకు కారణం. అయితే, ప్రస్తుతానికి తొలి రౌండ్‌కు మాత్రమే మ్యాచ్ అఫీషియల్స్‌ను ఎంపిక చేయగా.. సూపర్ 8, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు ప్రకటించాల్సి ఉంది. జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభకానుంది. 

Tags:    

Similar News