పాండ్యాపై బీసీసీఐ ఎందుకు వేటు వేయలేదు.. కారణం ఏంటంటే?

టీమ్ ఇండియా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించిన విషయం తెలిసిందే.

Update: 2024-02-29 19:52 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. సరైన కారణం లేకుండా బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వీరిద్దరూ దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉండటంతో వేటు పడింది. దీంతో ప్రస్తుతం భారత క్రికెట్‌లో దీనిపైనే చర్చ జరుగుతుంది. అదే సమయంలో దేశవాళీ క్రికెట్‌కు అందుబాటులో ఉండని హార్దిక్ పాండ్యాను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించకపోవడంపై బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో పలువురు బోర్డును ప్రశ్నిస్తున్నారు. భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండాలని భావించే హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు వైట్ బాల్ క్రికెట్‌లో పాల్గొనాలా?. ఇది అందరికీ వర్తించకపోతే భారత క్రికెట్ ఆశించిన ఫలితాలను సాధించదు.’ అని ట్వీట్ చేశాడు.

తాజాగా బీసీసీఐ రిలీజ్ చేసిన వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో పాండ్యా ‘ఏ’గ్రేడ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో హార్దిక్ పాండ్యా కాలుకి గాయమైన విషయం తెలిసిందే. మడమ గాయంతో అతను జాతీయ జట్టుకు దూరమయ్యాడు. సౌతాఫ్రికా పర్యటన, అఫ్గాన్‌తో టీ20 సిరీస్లతోపాటు సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ కూడా దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత కూడా అతను ఫిట్‌నెస్‌ కారణంగా సెలెక్షన్‌కు అందుబాటులో లేడు. ఇదే సమయంలో ఐపీఎల్ కోసం అతను సన్నద్ధమవుతున్నట్టు వచ్చిన వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఇషాన్ కిషన్‌తో కలిసి అతను ప్రాక్టీస్ చేసిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లపై వేటు వేసిన బోర్డు పాండ్యాను మినహాయించడంపై విమర్శలు వస్తున్నాయి. అందరికీ ఒకేలా నిబంధనలు ఉండాలని, పాండ్యాకు బోర్డు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

అయితే, సెంట్రాల్ కాంట్రాక్ట్‌లో పాండ్యాను కొనసాగించడంపై బోర్డు వర్గాలు స్పందించాయి. రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు అతను ఫిట్‌గా లేడని తెలిపాయి. ‘బీసీసీఐ మెడికల్ టీమ్ అంచనా ప్రకారం.. పాండ్యా రెడ్ బాల్ టోర్నమెంట్‌లో బౌలింగ్ చేయలేడు. అందుకే, అతను రంజీ ట్రోఫీ ఆడలేదు. అయితే, అతనికి వైట్ బాల్ క్రికెట్‌కు అందుబాటులో ఉండాలని చెప్పాం. జాతీయ జట్టు బాధ్యతలు లేనప్పుడు అతను వైట్‌బాల్ టోర్నీలు ఆడకపోతే కాంట్రాక్ట్‌ కోల్పోతాడు.’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. గాయం అనంతరం పాండ్యా ఇటీవలే తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను డీవై పాటిల్ టోర్నమెంట్ ఆడుతున్నాడు. 

Tags:    

Similar News