హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా
ప్రస్తుత సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా ఓడిపోయిన ముంబై జట్టు పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో ఉంది.

- ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన పాండ్యా
- స్లో ఓవర్ రేటు కారణంగా రూ.12 లక్షల ఫైన్
- గత సీజన్‌లోనూ ఇదే కారణంగా ఒక మ్యాచ్ సస్పెన్షన్
దిశ, స్పోర్ట్స్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మళ్లీ అదే తప్పు చేశాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గురాత్ టైటాన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి.. స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా విధించినట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి 2.2 ప్రకారం పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా విధించడంతో పాటు, ఈ సీజన్‌లో తొలి స్లో ఓవర్ రేటు కారణంగా మందలించినట్లు తెలిసింది. 2025 ఐపీఎల్ సీజన్‌లో ఒక కెప్టెన్‌ను జరిమానా విధించడం ఇదే తొలి సారి. గత సీజన్‌లో కూడా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. అయితే ఆ సీజన్‌లో ముంబై ఆ తర్వాత మ్యాచ్‌లు ఆడలేదు. దీంతో 2025 సీజన్ తొలి మ్యాచ్‌కు పాండ్యా దూరమయ్యాడు. అందుకే ముంబై జట్టు తొలి మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు.
ప్రస్తుత సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా ఓడిపోయిన ముంబై జట్టు పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో ఉంది. సోమవారం వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. శనివారం ఓటమి తర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. బ్యాటింగ్, బౌలింగ్‌ల రెండు చోట్లా విఫలమయ్యామని భావిస్తున్నాను. ప్రాథమిక తప్పిదాల కారణంగా పరుగులు భారీగా ఇచ్చాము. జీటీ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని హార్దిక్ అన్నాడు.