దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో యూపీ వారియర్స్ ప్లే ఆఫ్స్ దారులు దాదాపు మూసుకపోయినట్టే. గుజరాత్ జెయింట్స్‌తో చావోరేవో పోరులో ఆ జట్టు ఓడటంతో నాకౌట్ ఆశలు గల్లంతయ్యాయి. ఢిల్లీ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీపై 8 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపొందింది. దీప్తి శర్మ యూపీని గెలిపించేందుకు చివరి వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 152/8 స్కోరు చేసింది. బెత్ మూనీ(74 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంది. మరో ఓపెనర్ వొల్వార్డ్(43) రాణించింది. అనంతరం లక్ష్య ఛేదనలో యూపీ జట్టు నిర్ణీత ఓవర్లలో 144/5 స్కోరుకే పరిమితమైంది. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా.. చివరి వరకూ దీప్తి శర్మ(88 నాటౌట్) ఒంటరి పోరాటం చేసింది. పూనమ్ ఖేమ్నార్(36 నాటౌట్) సహకారంతో జట్టును విజయం దిశగా నడిపించినా ఆఖర్లో గుజరాత్ బౌలర్లు అడ్డుకోవడంతో దీప్తి పోరాటం వృథా అయ్యింది. పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్ 6 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నది. ఢిల్లీ, ముంబై ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. మూడో స్థానం కోసం బెంగళూరు, యూపీ మధ్య పోటీ నెలకొంది. అయితే, ఆఖరి మ్యాచ్‌లో బెంగళూరు ఓడినా మెరుగైన రన్‌రేటుతో ఆ జట్టే ముందడుగు వేసే అవకాశాలే ఎక్కువ.
దీప్తి శర్మ పోరాటం వృథా
153 పరుగుల లక్ష్య ఛేదనలో యూపీ ఆరంభంలో దారుణంగా తడబడింది. తొలి ఓవర్‌లోనే ఆ జట్టుకు షబ్నిమ్ షకీల్ భారీ షాకిచ్చింది. హీలీ(4), చమరి ఆటపట్టు(0)లను పెవిలియన్ పంపింది. స్వల్ప వ్యవధిలోనే కిరణ్ నవ్‌గిరే(0), గ్రేస్ హ్యారిస్(1), శ్వేత సెహ్రావత్(8) వికెట్లు పారేసుకున్నారు. దీంతో యూపీ జట్టు 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ఆ జట్టు పుంజుకుంటుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, దీప్తి శర్మ(88 నాటౌట్) అద్భుతమైన పోరాట పటిమ కనబర్చింది. సంచలన ఇన్నింగ్స్ ఆడిన ఆమె జట్టును పోటీలోకి తీసుకొచ్చింది. ఆమెకు పూనమ్ ఖేమ్నార్(36 నాటౌట్) సహకరించింది. దీంతో చివరి ఓవర్‌లో యూపీ విజయానికి 26 పరుగులు కావాల్సి ఉండగా.. చక్కగా బౌలింగ్ చేసిన మేఘ్న సింగ్ 17 పరుగులే ఇవ్వడంతో గుజరాత్ 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్ బౌలర్లలో షబ్నిమ్ షకీల్ 3 వికెట్లతో సత్తాచాటగా.. బ్రైస్, గార్డ్‌నెర్ చెరో వికెట్ పడగొట్టారు.
మెరిసిన మూనీ
అంతకుముందు టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 152 పరుగులు చేసిందంటే కెప్టెన్ బెత్ మూనీ(74 నాటౌట్) పోరాటమే కారణం. మొదట మరో ఓపెనర్ వొల్వార్డ్(43)తో కలిసి ఆమె జట్టుకు శుభారంభం అందించింది. ధాటిగా ఆడిన వీరిద్దరూ తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. అయితే, వొల్వార్డ్ అవుటైన తర్వాత మూనీకి మరో ఎండ్‌లో సరైన సహకారం దక్కలేదు. యూపీ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీస్తూ వచ్చారు. హేమలత(0), లిచ్‌ఫీల్డ్(4), గార్డ్‌నెర్(15), భారతి ఫుల్మాలి(1) నిరాశపరిచారు. దీంతో మూనీ చివరి వరకు ఒంటరి పోరాటం చేసింది. యూపీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఆమె 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మూనీ మెరవడంతోనే గుజరాత్‌కు పోరాడే స్కోరు దక్కింది. యూపీ బౌలర్లలో ఎక్లోస్టోన్ 3 వికెట్లు, దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్‌కు ఒక్క వికెట్ దక్కింది.
సంక్షిప్త స్కోరుబోర్డు
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ : 152/8(20 ఓవర్లు)
(బెత్ మూనీ 74 నాటౌట్, వొల్వార్డ్ 43, ఎక్లోస్టోన్ 3/38, దీప్తి శర్మ 2/22)
యూపీ వారియర్స్ ఇన్నింగ్స్ : 144/5(20 ఓవర్లు)
(దీప్తి శర్మ 88 నాటౌట్, పూనమ్ ఖేమ్నార్ 36 నాటౌట్, షబ్నమ్ షకీల్ 3/11)