మెక్‌కల్లమ్‌కు అందరి ముందు క్షమాపణ చెప్పా : గౌతమ్ గంభీర్

న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు అందరి ముందు క్షమాపణలు చెప్పానని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపాడు.

Update: 2024-02-08 15:17 GMT

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు అందరి ముందు క్షమాపణలు చెప్పానని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. 2012లో గంభీర్ సారథ్యంలో కేకేఆర్ జట్టు తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచింది. ఆ సీజన్‌లో మెక్‌కల్లమ్‌ కేకేఆర్ తరపున సత్తాచాటాడు. అయితే, చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో ఫైనల్‌కు మాత్రం టీమ్ కాంబినేషన్ కోసం అతన్ని తుది జట్టులోకి తీసుకోలేదు. దీంతో మెక్‌కల్లమ్‌కు గంభీర్ క్షమాపణలు చెప్పాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గంభీర్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ ఇంటర్వ్యూ వీడియోను అతను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

‘ఫైనల్ కోసం చెపాక్‌కు వెళ్లే ముందు అందరి ముందు మెక్‌కల్లమ్‌ను క్షమాపణలు కోరా. ‘నిన్ను తప్పించినందుకు క్షమించు. నీ ప్రదర్శన వల్ల నిన్ను తప్పించడం లేదు. టీమ్ కాంబినేషన్‌ కోసం చేయాల్సి వస్తుంది.’ అని అతనికి వివరించాను. ఎవరూ అలా చేయరు. టీమ్ ముందు సారీ చెప్పాలంటే ధైర్యం ఉండాలి. క్షమాపణలు కోరడం తప్పేం కాదు. అలా చేసి ఉండకపోతే తప్పు చేశానని నాలో ఉండేది. కెప్టెన్ అంటే ప్రశంసలు పొందడం, క్రెడిట్ తీసుకోవడమే కాదు. కొన్నిసార్లు క్షమాపణలు కూడా చెప్పాలి. నాయకుడిగా ఎదగాలంటే ఇవన్నీ చేయాల్సిందే.’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా, 2014లోనూ గంభీర్ నాయకత్వంలోనే కేకేఆర్ రెండోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆ జట్టు మరోసారి టైటిల్ గెలవలేకపోయింది. గత సీజన్‌లో 7వ స్థానంతో సరిపెట్టింది. ప్రస్తుతం అతను కేకేఆర్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. 

Tags:    

Similar News