ధర్మశాలలో లాస్ట్ పంచ్ మనదైతే.. 112 ఏళ్ల రికార్డు సొంతమైనట్టే.! నేటి టెస్టు మ్యాచ్ విశేషాలివే..
దిశ, స్పోర్ట్స్: ‘‘లాస్ట్ పంచ్ మనదైతే దానికొచ్చే కిక్కే వేరప్పా’’ అంటూ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ గుర్తుందా? భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న ఆఖరి టెస్టు మ్యాచ్‌కు ఈ డైలాగ్ వాడే సందర్భం వచ్చింది. సొంతగడ్డపై జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 3-1తో సిరీస్‌ను దక్కించుకున్న టీమ్ ఇండియా.. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో ధర్మశాల వేదికగా చివరిదైన ఐదో టెస్టుకు సిద్ధమైంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపుమీదున్న రోహిత్ సేన.. గురువారం నుంచి జరగనున్న ఈ ఆఖరి టెస్టులోనూ గెలిస్తే శతాబ్దకాలం నాటి ఓ అరుదైన రికార్డును సమం చేయనుంది. అంతేకాకుండా, ‘వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్’(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనుంది. అలాగే, కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న స్పిన్నర్ అశ్విన్‌కు.. ఈ విజయాన్ని బహుమతిగా ఇచ్చినట్టు ఉంటుంది. కానీ, ఐదో టెస్టులో టీమ్ ఇండియా ఓడితే మాత్రం డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలంటే..
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 64.58 విన్నింగ్ పర్సంటేజ్‌తో భారత్ అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్(60), ఆస్ట్రేలియా(59.09)తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియాకు అత్యంత సమీపంలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్ ఓడిపోయి, ఆసిస్, కివీస్‌లలో ఏ జట్టు గెలిస్తే అది అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఐదో టెస్టులో భారత్ విజయం సాధిస్తే మాత్రం, ఆయా జట్ల గెలుపోటములతో సంబంధం లేకుండా అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది. కాబట్టి, భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే ఐదో టెస్టులో విజయం అత్యంత కీలకం.
112 ఏళ్ల రికార్డుకు చేరువలో..
ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు ఆడనున్న భారత్.. అత్యంత అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. 3-1తో సిరీస్‌ను దక్కించుకున్న రోహిత్ సేన.. మరో మ్యాచ్‌లో గెలిస్తే 112 ఏళ్లనాటి రికార్డును సమం చేయనుంది. ఐదో టెస్టులో భారత్ గెలిస్తే గనుక, 112 ఏళ్లలో తొలిగేమ్ ఓడి 4-1 తేడాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న తొలి జట్టుగా అవతరించనుంది. 1912 తర్వాత ఈ ఘనత సాధించిన మొదటి టీమ్‌గా నిలవనుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం మూడు జట్లు మాత్రమే తొలి గేమ్‌లో ఓడి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో దక్కించుకున్నాయి. 1897-98, 1901-02లలో ఆస్ట్రేలియా రెండుసార్లు ఇంగ్లాండ్‌పై తొలి మ్యాచ్ ఓడి మిగతా నాలుగింట్లో వరుసగా గెలిచింది. 1911-12లో ఇంగ్లాండ్ జట్టు కూడా ఆస్ట్రేలియాపై ఇలానే గెలిచింది. 1912 నుంచి ఇప్పటివరకు టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిపోయి వరుసగా 4 మ్యాచ్‌లనూ ఏ జట్టూ గెలవలేదు.
వర్షం ముప్పు.. పిచ్ ఎలా ఉందంటే?
హిమాచల్ ప్రదేశ్‌లో కొన్ని రోజులుగా భారీగా హిమపాతం, వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం మ్యాచ్‌పైనా పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వర్షం, హిమపాతం లేకపోయినా తీవ్రమైన ఈదురుగాలులు ఆటగాళ్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణ వాతావరణం ఉంటే, పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. తొలి సెషన్‌లో గాలిలో తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉందికాబట్టి, బుమ్రా లేదంటే, జేమ్స్ అండర్సన్ ప్రభావం చూపొచ్చని క్రికెట్ విశ్లేషకులు తెలిపారు.
100వ టెస్టు వీరులు
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోకు ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకమైంది. తమ టెస్టు కెరీర్‌లో ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం.
వేదిక: హెచ్‌పీడీఏ స్టేడియం, ధర్మశాల
సమయం: ఉదయం 9:30 గంటల నుంచి
లైవ్ బ్రాడ్‌కాస్ట్: స్పోర్ట్స్ 18
లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా
తుది జట్లు
భారత్(అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, రాజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, జడేజా, ధ్రువ్ జురెల్(కీపర్), అశ్విన్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్
ఇంగ్లాండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పాప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(కీపర్), టామ్ హార్ట్‌లీ, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్