MS Dhoni : చిక్కుల్లో ధోనీ.. టీమిండియా మాజీ కెప్టెన్‌పై ఫిర్యాదు
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీపై బీసీసీఐకి ఫిర్యాదు అందింది.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీపై బీసీసీఐకి ఫిర్యాదు అందింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన రాజేశ్ కుమార్ మౌర్య బీసీసీఐ రూల్ 39 ప్రకారం ధోనీపై బోర్డు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు తనను మోసం చేశారని ధోనీ తన మాజీ వ్యాపార భాగస్వాములు అయిన మాజీ క్రికెటర్ మిహిర్ దివాకర్, ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన సౌమ్య దాస్‌లపై దాఖలు చేసిన కేసుకు సంబంధించినది. ధోనీ పేరుతోనే మేనేజ్‌మెంట్ అకాడమీలు నిర్వహించిందని రాజేశ్ కుమార్ ఆరోపణలు చేశాడు. ఈ మేరకు బీసీసీఐ ఎథిక్స్ కమిటీ ఈ నెల 30 లోపు స్పందించాలని ధోనీని కోరింది. అలాగే, ధోనీ స్పందనపై వచ్చే నెల 16లోగా రిప్లై ఇవ్వాలని మౌర్యను ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..
మాజీ మిహిర్ దివాకర్, ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన సౌమ్య దాస్‌లపై ధోనీ రాంచీలోని సివిల్ కోర్టులో ఫ్రాడ్ కేసు పెట్టాడు. 2021లో తనతో ఒప్పందం ముగిసిన తర్వాత కూడా తన పేరును వాడుకుని అకాడమీలు ఏర్పాటు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నాడు. అకాడమీల ద్వారా వచ్చిన లాభాల్లో ధోనీ వాటా పొందలేదని, అతనికి రూ. 15 కోట్లు నష్టం వాటిల్లిందని ధోనీ లాయర్ తెలిపారు. దీనిపై ఈ ఏడాది మార్చిలో కోర్టు.. మహిర్ దివాకర్, సౌమ్య దాస్, ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సమన్లు పంపింది. ధోనీ పేరుతోనే అకాడమీలు నిర్వహించడంతో రాజేశ్ కుమార్ ధోనీపై బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.