బంగ్లాదేశ్ కెప్టెన్‌కు శాంటో.. ఏడాదిపాటు పగ్గాలు

బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. మూడు ఫార్మాట్లలో ఆ జట్టును నజ్ముల్ హుస్సేన్ శాంటో నడిపించనున్నాడు.

Update: 2024-02-12 19:19 GMT

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. మూడు ఫార్మాట్లలో ఆ జట్టును నజ్ముల్ హుస్సేన్ శాంటో నడిపించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కంటి సమస్యతో జట్టుకు దూరమవ్వగా..అతను తిరిగి రావడంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) అతని స్థానంలో శాంటోను ఏడాది పాటు కెప్టెన్‌గా నియమించింది. కొత్త కెప్టెన్ ఏడాది పాటు జట్టు పగ్గాలు చేపడతాడని బీసీబీ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ తెలిపారు.

గతేడాది చివర్లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో శాంటో సారథిగా వ్యవహరించాడు. ఆ సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగియగా.. కెప్టెన్‌గా శాంటో ఆకట్టుకున్నాడు. అలాగే, న్యూజిలాండ్‌ పర్యటనలోనూ నాయకత్వం వహించాడు. మొత్తంగా అతని సారథ్యంలో బంగ్లాదేశ్ 11 మ్యాచ్‌లు ఆడగా.. మూడింట గెలిచింది. సొంతగడ్డపై మార్చిలో శ్రీలంకతో బంగ్లాదేశ్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌తో శాంటో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌తో అతను పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నాడు. జూన్‌లో పొట్టి ప్రపంచకప్‌కు అమెరికా, విండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో బంగ్లాను శాంటో ఏ విధంగా నడిపిస్తాడో చూడాలి. గతేడాది భారత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ 8వ స్థానంతో సరిపెట్టింది. 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండింట మాత్రమే నెగ్గింది. 

Tags:    

Similar News