విజయానికి శ్రీలంక 3 వికెట్ల దూరంలో..
ఆతిథ్య బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ క్లీన్‌స్వీప్‌కు శ్రీలంక అడుగుదూరంలో నిలిచింది.
దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ క్లీన్‌స్వీప్‌కు శ్రీలంక అడుగుదూరంలో నిలిచింది. ఇప్పటికే తొలి టెస్టును నెగ్గిన ఆ జట్టు.. చటోగ్రామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో గెలుపు దిశగా దూసుకెళ్తున్నది. విజయానికి శ్రీలంక మరో మూడు వికెట్ల దూరంలో నిలిచింది. మంగళవారం మొదట ఓవర్‌నైట్ స్కోరు 102/6తో ఆట కొనసాగించిన శ్రీలంక 157/7 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 353 పరుగులు కలుపుకుని ఆ జట్టు బంగ్లాదేశ్ ముందు 511 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన బంగ్లా ఛేదనలో పోరాటం చేస్తున్నది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 268/7 స్కోరుతో నిలిచింది. మోమినుల్ హక్(50) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. శ్రీలంక బౌలర్లు లాహిరు కుమారా, ప్రభాత్ జయసూర్య, కమింద్ మెండిస్ సమిష్టిగా రాణించడంతో బంగ్లా కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఆ జట్టు ఇంకా 243 పరుగుల దూరంలో ఉన్నది. మరో మూడు వికెట్లు తీస్తే శ్రీలంక విజయతీరాలకు చేరనుంది.