పారిస్ ఒలింపిక్స్‌కు రోవర్ బల్‌రాజ్ పన్వార్ అర్హత
భారత రోవర్ బల్‌రాజ్ పన్వార్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
దిశ, స్పోర్ట్స్ : భారత రోవర్ బల్‌రాజ్ పన్వార్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఆదివారం సౌతాఫ్రికాలో జరిగిన ఏషియన్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో అతను తన కోటా స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. దీంతో ఈ విశ్వక్రీడల్లో రోయింగ్‌లో భారత్‌కు తొలి బెర్త్ అందించాడు. పురుషుల సింగిల్స్ స్కల్ ఈవెంట్‌లో 2,000 మీటర్ల రేసులో పన్వార్ 7:01:27 సమయంలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. మొదట పేలవ ప్రారంభంతో వెనుకబడిన పన్వార్ ఆ తర్వాత పుంజుకున్నాడు. రెండో దశలో ముందుకు దూసుకెళ్లి తాను అనుకున్నది సాధించాడు. సింగిల్స్ స్కల్స్‌లో టాప్-5లో నిలిచిన వాళ్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.
పురుషుల లైట్‌వెయిట్ డబుల్స్ స్కల్స్ ఈవెంట్‌లో అరవింద్ సింగ్, ఉజ్వల్ కుమార్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. తమ విభాగంలో మూడో స్థానంలో నిలువగా.. టాప్-2 వారికే అవకాశం ఉంది. మరోవైపు, పారా రోయర్స్ నారాయణ కొంగనపల్లె-అనిత జోడీ పారిస్ పారాలింపిక్స్ బెర్త్ దక్కించుకుంది. మిక్స్‌డ్ డబుల్ స్కల్ ఈవెంట్‌లో భారత జంట 7:50: 80 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది.