Aus vs Pak: సిరీస్‌ కంగారూలదే.. రెండో టెస్టులో పాక్‌ చిత్తు..

Update: 2023-12-29 10:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌తో రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య డిసెంబరు 14న మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్‌ ఏకంగా 360 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టును 318 పరుగులకు కట్టడి చేయగలిగింది పాక్‌. కానీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 264 పరుగులకే షాన్‌ మసూద్‌ బృందం ఆలౌట్‌ కావడంతో.. ఆసీస్‌కు 54 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు పాక్‌ ఆరంభంలోనే షాకిచ్చింది. పేసర్లు షాహిన్‌ ఆఫ్రిది, మీర్‌ హంజా దెబ్బకు టాపార్డర్‌ కుప్పకూలిపోయింది. 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ ఇబ్బందుల్లో పడింది. ఈ క్రమంలో.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 62.3 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఓవరాల్‌గా 241 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 262 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ ముగించింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా సారథి ప్యాట్‌ కమిన్స్‌ బెంబేలెత్తించాడు. 5 వికెట్లతో చెలరేగి పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.

దీంతో పాకిస్తాన్‌ 237 పరుగులకే చాపచుట్టేసింది. షాన్‌ మసూద్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌(71 బంతుల్లో 60 పరుగులు), ఆగా సల్మాన్‌ అర్ధ శతకం(50)తో రాణించినా ఫలితం లేకుండా పోయింది. 79 పరుగుల తేడాతో ఆసీస్‌ చేతిలో ఓటమి పాలు కాగా నాలుగో రోజే ఆట ముగిసిపోయింది. ఇక పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో స్టార్క్‌ నాలుగు, జోష్‌ హాజిల్‌వుడ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ప్యాట్‌ కమిన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఆస్ట్రేలియా- పాకిస్తాన్‌ మధ్య ఆఖరి టెస్టు జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.


Similar News